వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి ఫీజుల్లో మార్పు

  • ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫీజుల నిర్ధారణ 
  • నెలాఖరులోగా టీఏఎఫ్​ఆర్సీ నోటిఫికేషన్!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ తో పాటు అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం ఫీజులు మారనున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తును తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా టీఏఎఫ్​ఆర్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నది. 

సోమవారం మాసబ్ ట్యాంక్ లోని టీఏఎఫ్ఆర్సీ ఆఫీసులో కమిటీ సమావేశం నిర్వహించారు. 2024–25 విద్యా సంవత్సరంతో బ్లాక్ పీరియేడ్  ముగియనుండడంతో.. వచ్చే బ్లాక్ పీరియడ్ 2025–28 సంవత్సరాలకు ఫీజులను నిర్ణయించడంపై చర్చించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బీఎడ్, మేనేజ్​మెంట్, లా తదితర కోర్సుల ఫీజులను ప్రతి మూడేండ్ల కోసారి టీఏఎఫ్ఆర్సీ నిర్ణయిస్తోంది. గత బ్లాక్ పీరియడ్ 2022–23, 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు ఫీజు గడువు ఈ ఏడాదితో ముగియనున్నది. 

దీంతో రానున్న  2025–26, 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ ప్రారంభమైంది. వచ్చేనెలలో మేనేజ్మెంట్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంత ఫీజు కోరుకుంటున్నారనే వివరాలనూ వాటి నుంచి తీసుకుంటారు. అనంతరం.. వారితో టీఏఎఫ్​ఆర్సీ అధికారులు సమావేశమై.. ఆయా కాలేజీల్లోని ఫెసిలిటీస్, సిబ్బందికి ఇచ్చే జీతాల ఆధారంగా ఫీజులను ఖరారు చేస్తారు. వాటిని సర్కారుకు పంపించి, అధికారంగా జీవో రిలీజ్ చేస్తారు. అయితే, మినిమమ్ ఫీజును పెంచాలా? లేదా? అనే దానిపైనా సర్కారు నిర్ణయం తీసుకోనున్నది.