కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు నియంత్రించాలి

కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు నియంత్రించాలి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు నియంత్రించాలని, గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డును ముట్టడించాయి. గుర్తింపు లేని కాలేజీలను మూసివేయాలని డిమాండ్ చేశాయి. శుక్రవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాల నేతలు, కార్యకర్తలు వేర్వేరుగా నాంపల్లి నుంచి ర్యాలీగా ఇంటర్ బోర్డుకు చేరుకున్నారు. ముందుగానే పోలీసులు ఇంటర్ బోర్డు గేట్లు మూసివేయడంతో వారంతా అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. అప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. గేట్లు ఎక్కి నిరసన తెలియజేశారు. తర్వాత స్టూడెంట్ యూనియన్ నేతలను అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల వసూలు

కార్పొరేట్ కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ, రెసోనెన్స్ లాంటి కార్పొరేట్ కాలేజీలు అకాడమీలు, కోచింగ్​ల పేరుతో లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నా.. ఇంటర్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సర్కారు కాలేజీల బలోపేతానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా తర్వాత ఎస్ఎఫ్ఐ నేతలు ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతిఓజాను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.