
- అడ్డగోలుగా పెంచేసిన రాష్ట్ర సర్కారు
- రూ.2,400 నుంచి ఏకంగా 14 వేలకు ఎంఏ కోర్సు ఫీజు
- ఇంజనీరింగ్ కోర్సుకు రూ.44 వేల నుంచి 70 వేలకు పెంచిన్రు
- కొత్త ఫీజులను ప్రకటించిన ఓయూ, కేయూ, జేఎన్‍టీయూ
- రీయింబర్స్‌మెంట్ పెంచకుంటే పేద పిల్లలకు చదువు దూరమే
- నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని స్టూడెంట్ల ఆందోళనలు
వరంగల్, వెలుగు: యూనివర్సిటీల్లో కోర్సుల ఫీజులను రాష్ట్ర సర్కారు అడ్డగోలుగా పెంచేసింది. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ ఫీజులను డబుల్, ట్రిపుల్ చేసింది. గతంలో రూ.2,410 ఉన్న ఎంఏ కోర్సు ఏడాది ఫీజును రూ.14 వేలకు పెంచగా.. రూ.44 వేలు ఉండే ఇంజినీరింగ్ కోర్సును రూ.70 వేలు చేసింది. ఇదే తరహాలో దాదాపు 70 కోర్సుల చదువులను కాస్ట్‌లీ చేసింది. ఇప్పటికే జేఎన్‍టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు తమ కొత్త ఫీజుల వివరాలు ప్రకటించగా.. మిగతా వర్సిటీలు రేపోమాపో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాయి. ప్రభుత్వం పేద, మిడిల్ క్లాస్ పిల్లలను చదువులకు దూరం చేసే కుట్రను మానుకోవాలని స్టూడెంట్ల సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.
ఫండ్స్ ఇవ్వకుండా.. ఫీజులు పెంచుకొమ్మంటూ
రాష్ట్రంలోని గవర్నమెంట్ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు ఏండ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. ఉన్నతస్థాయి చదువుల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాల్సిన ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయడంలేదు. వర్సిటీల్లోని ల్యాబ్‍ల్లో ప్రాక్టికల్స్ చేయలేని దుస్థితి. క్లాస్‍రూంలు, హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించడంలేదు. ఈ క్రమంలో వర్సిటీల అభివృద్ధికి స్పెషల్ బడ్జెట్ కేటాయించాల్సిన సర్కార్.. ఆ భారాన్ని స్టూడెంట్లపైకి నెట్టింది. ఫీజుల పెంపుపై జీఓ నంబర్ 141 పేరుతో రిలాక్సేషన్ ఇచ్చింది. ఆయా యూనివర్సిటీల్లోని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కమిటీలు కొత్త ఫీజుల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఓయూ ఫీజుల ఆధారంగా కేయూ.. కేయూ వివరాల ఆధారంగా మిగతా యూనివర్సిటీలు ట్యూషన్ ఫీజులు పెంచుతున్నాయి. ఈ లెక్కన ఎంఏ, ఎంకామ్, ఎంటీఎం, ఎంఎస్‍డబ్ల్యూ, ఎంహెచ్‍ఆర్‍ఎం, ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎల్‍ఎల్‍బీ, ఎల్‍ఎల్‍ఎం, బీఫార్మసీ, బీటెక్, బీఎడ్, బీపీఈడీ, ఎంపీఈడీ. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ వంటి కోర్సుల్లో ఫీజుల మోత మోగింది.
మరి రీయింబర్స్‌మెంట్?
పెరిగిన పీజీ, ఇంజనీరింగ్ ఫీజులతో స్టూడెంట్లకు నష్టం ఉండదని.. మెజార్టీ స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తోందని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. కానీ గతంలో ఉన్న ఫీజుకు అనుగుణంగా వచ్చే రీయింబర్స్‌మెంట్ వల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరేదని, ఇప్పుడు ఫీజు పెరిగింది తప్పితే రీయింబర్స్‌మెంట్ పెరగలేదని స్టూడెంట్లు అంటున్నారు. బీటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకు నిన్నటి దాకా రూ.44,770 ఫీజు ఉండేది. ఇందులో 35,000 రీయింబర్స్‌మెంట్ కింద వచ్చేది. మిగతా ఫీజు మాత్రమే స్టూడెంట్ కట్టాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ కోర్స్ ఫీజును 70 వేలు చేశారు. రీయింబర్స్‌మెంట్ మొత్తం మాత్రం పెంచలేదు. తద్వారా మిగతా రూ.35 వేల భారం స్టూడెంట్‌పైనే పడనుంది. ఇవేగాక రూ.11 వేలు డెవలప్‍మెంట్ ఫీజు, హాస్టల్ ఫీజు రూ.15 వేలు, లైబ్రరీ అండ్ రికార్డ్ ఫీజు రూ.1,200 చొప్పున స్టూడెంట్స్ తమ జేబులో నుంచి కట్టాల్సిందే. ఓసీ కులాల్లోని పేద స్టూడెంట్ల పరిస్థితి మరీ దారుణంగా మారే ప్రమాదం ఉంది.
ఫీజులు తగ్గించాలి
కేయూ పరిధిలోని పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని స్టూడెంట్ యూనియన్లు రోడ్డెక్కుతున్నాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో ఈనెల 3 నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏండ్ల తరబడి ఖాళీగా ఉంటున్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి నాణ్యమైన విద్య అందించాలంటూ స్టూడెంట్స్ క్లాసులు బహిష్కరించారు. ఆఫీసర్లు సరిగ్గా స్పందించకపోవడంతో స్టూడెంట్లు ఆందోళనలు తీవ్రం చేశారు. నిరసనల్లో మెయిన్ బిల్డింగ్‍లోని అద్దాలు పలగడంతో స్టూడెంట్లపై పోలీసులు కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్ తరలించారు. దీనికి నిరసనగా కేయూ బంద్‍కు స్టూడెంట్లు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చే దాకా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రెగ్యులర్ కోర్సులు.. ఎస్‍ఎఫ్‍సీ కిందికి
కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ రెగ్యులర్ కోర్సులను.. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులుగా మార్చారని స్టూడెంట్లు చెబుతున్నారు. ఐటీ, సివిల్ విభాగాల్లోని రెగ్యులర్ కోర్సులను ఎస్‍ఎఫ్‍సీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్సులను ఎస్‍ఎఫ్‍సీ కిందికి మార్చడంతో కేవలం డబ్బులున్న వారు మాత్రమే జాయిన్ అవుతున్నారని అంటున్నారు. తక్కువ మంది చేరుతున్నారని, భవి ష్యత్తులో ఆయా కోర్సులకు డిమాండ్ లేదనే పేరుతో డిపార్ట్‌మెంట్లనే ఎత్తేసే కుట్ర జరుగుతోందని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు.
కొన్ని కోర్సుల్లో ఫీజుల మోత ఇలా
జేఎన్‍టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు కొత్త ఫీజు వివరాలను ప్రకటించాయి. వీటిలో ఒక్కో కోర్సులో రూ.500 నుంచి రూ.1,000 అటుఇటుగా ఉంది. ఫెసిలిటీస్ పరంగా ఓయూ, జేఎన్‍టీయూతో పోలిస్తే వెనకబడి ఉన్న కాకతీయ యూనివర్సిటీలోనూ భారీగా ఫీజులు పెంచారు.
ఎంఏ–ఇంగ్లిష్, తెలుగు, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, సోషియాలజీ రెగ్యులర్ విభాగాల్లో రూ.2,410 ఉన్న ఫీజు ఇప్పుడు రూ.14,000
ఎంటీఎం రూ.3,410 నుంచి 16,000 ఎంహెచ్‍ఆర్‍ఎం రూ.3,410 నుంచి 20,000
ఎంకాం రూ.2,410 నుంచి 20,000 ఎల్‍ఎల్‍బీ రూ.7,420 నుంచి 16,000
ఎల్‍ఎల్‍ఎం రూ.8,220 నుంచి రూ.23,000 ఎంబీఏ రూ.14,220 నుంచి రూ.35,000
ఎమ్మెస్సీ–బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ రెగ్యులర్ కోర్సు రూ.3,010 నుంచి రూ.21,000
రీయింబర్స్‌మెంట్ పెంచితే.. ఫీజులు తగ్గిస్తం
రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఫ్యాకల్టీతో సమానంగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలని సూచించింది. ఆ భారం కాస్త రూ.4.5 కోట్ల నుంచి రూ.8.3 కోట్లకు చేరింది. యూనివర్సిటీలో అంత బడ్జెట్ లేకపోవడంతో జీఓ నంబర్ 141 ప్రకారం ఫీజు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఈసీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఫీజులు పెంచాం. ఒకవేళ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ పెంచితే.. విద్యార్థుల నుంచి తీసుకునే ఫీజును తగ్గిస్తాం.
- ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డి, రిజిస్ట్రార్, కేయూ
మాలాంటోళ్లకు కష్టమే
ఇన్నాళ్లూ రెగ్యులర్‍గా ఉన్న ఇంజనీరింగ్ కోర్సును ఇప్పుడు ఎస్‍ఎఫ్‍సీ అంటున్నారు. ఈ ఏడాది అన్ని కోర్సులతో పాటు ట్యూషన్ ఫీజు పెంచారు. కానీ రీయింబర్స్‌మెంట్ పెంచలేదు. దీనికితోడు డెవలప్‍మెంట్ ఫీ, లైబ్రరీ ఫీజు, రికార్డ్ ఫీజు ఉంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు హాస్టల్ సౌకర్యం లేదు. ప్రైవేట్ హాస్టల్లో ఉండాలె. ఇంతా ఖర్చు చేసి క్లాసులకు వస్తే ఇప్పటికీ ఫుల్ టైం ఫ్యాకల్టీ లేదు. ల్యాబ్‍ల్లో పరికరాలు లేవు. నిన్నమొన్నటి వరకు అసలు కరెంట్ కూడా లేదు.
- ప్రవీణ్, స్టూడెంట్, కేయూ