
- టెన్త్ స్టూడెంట్‌ను చితకబాదిన తోటి విద్యార్థులు
- మంచిర్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- ప్రిన్సిపాల్‌తో పాటు ఏడుగురు విద్యార్థులు సస్పెన్షన్
- ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని స్టూడెంట్ల ఆందోళన
చెన్నూరు, వెలుగు : టెన్త్ చదువుతున్న ఓ స్టూడెంట్‌ను తోటి విద్యార్థులు చితకబాదడమే కాకుండా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల హాస్టల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సీసీ కార్నర్‌కు చెందిన మనోజ్‌గౌడ్ చెన్నూరు జ్యోతిబాపూలే గురుకులంలో ఉంటూ టెన్త్ చదువుతున్నాడు. అదే క్లాస్ చదువుతున్న రఘునాథ్, విజయ్, మణికంఠ, రంజిత్, సన్నీ, హర్షిత్, యువరాజ్ ఈ నెల 6న మనోజ్‌పై దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దాడి విషయం ఈ నెల 15న ప్రిన్సిపాల్ దృష్టికి రావడంతో స్టూడెంట్లను పిలిపించి మాట్లాడిన అనంతరం విద్యార్థుల పేరెంట్స్‌కు ఫోన్ చేసి చెప్పారు.
మనోజ్ తల్లిదండ్రులు శనివారం స్కూల్‌కు వచ్చి ప్రిన్సిపాల్‌ను కలిసే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేకపోవడంతో విద్యార్థిని తీసుకొని ఇంటికి వెళ్లారు. సోమవారం విద్యార్థి సంఘాల నాయకులతో వచ్చి హాస్టల్ ముందు ధర్నా చేపట్టారు. మనోజ్‌పై దాడి చేసిన స్టూడెంట్లపై చర్యలు తీసుకొని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్, వాచ్‌మన్, టీచర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం వాట్సప్‌లో రాష్ట్ర, జిల్లా ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎంజేపీ సెక్రటరీ.. చెన్నూరు స్కూల్ ప్రిన్సిపాల్ ప్రకాశ్‌రావును విధుల నుంచి తొలగిస్తూ, ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. మంచిర్యాల జ్యోతిబాపూలే బాయ్స్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న రాజకుమార్‌కు చెన్నూరు స్కూల్ బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడం సరికాదని స్టూడెంట్లు రాస్తారోకోకు దిగగా విషయం తెలుసుకున్న డీసీవో శ్రీధర్, స్థానిక సీఐ స్టూడెంట్లకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
ఎమ్మెల్యే వివేక్ ఆరా
చెన్నూర్ జ్యోతిబా పూలే స్కూల్‌లో స్టూడెంట్ల ఆందోళన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఘటనపై ఆరా తీశారు. స్టూడెంట్లు ఆందోళనకు దిగడానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు అందుకు ప్రేరేపించిన వారిని గుర్తించాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుకు సూచించారు. ఘటనకు కారణమైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.