మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారు.. నేను ఉండలేను

మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారు.. నేను ఉండలేను

పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌‌ను కలిసి రాజీనామా పత్రం అందజేశారు. తనతో పాటు కేబినెట్ మొత్తం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆయన రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానం జరుగుతోందని, ఇప్పటికి మూడు సార్లు అవమానించారని, ఈ తీరు కొనసాగితే పార్టీలోనూ కొనసాగలేనని  అమరీందర్ అన్నారు. ఈ విషయం గురించి ఉదయమే సోనియా గాంధీకి ఫోన్ చేసి మాట్లాడానని, తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పానని, వాళ్లకు ఎవరిపై నమ్మకం ఉంటే వాళ్లకే సీఎం పదవి ఇవ్వొచ్చని చెప్పానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునిచ్చిందని, గడిచిన రెండు నెలల్లో ఇలా జరగడం మూడో సారి అని, గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించారని అన్నారు. తన సామర్థ్యంపై అనుమానం ఉంటే, ఎవరిపై నమ్మకం ఉంటే వాళ్లను సీఎంగా పెట్టుకోవచ్చన్నారు. తన భవిష్యత్ ప్రణాళికపై కార్యకర్తలు, సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కెప్టెన్ చెప్పారు.

 

 

పంజాబ్‌లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై పట్టు కోసం, సీఎం కావాలన్న ఆకాంక్షతో కొన్నాళ్లుగా నవజోత్ సిద్ధూ ప్రయత్నిస్తున్నారు. అనేక దఫాలు పార్టీ హైకమాండ్‌ను కలిసి, రాష్ట్రంలో తన వర్గం నేతల్లో అసమ్మతిని రగిలించారు. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా అనేక సార్లు మంత్రాంగం నడిపారు. పార్టీలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యం అంటూ ఎట్టకేలకు ఇటీవలే సిద్ధూను పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే గడిచిన రెండు నెలల గ్యాప్‌లో రెండు సార్లు కొందరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని హైకమాండ్ చర్చలు జరిగింది. ఇప్పుడు మరోసారి కెప్టెన్‌కు వ్యతిరేకంగా  ఒక మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్‌కు లేఖ రాయడంతో  ఇవాళ ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పదే పదే తనను పార్టీ అవమానిస్తోందంటూ సీఎల్పీ సమావేశానికి ముందే అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేశారు.