విద్యుత్ శాఖలో మహిళా అటెండర్ పెత్తనం

నెల మొత్తం పనిచేస్తే గానీ చేతికి సరిగా జీతం రానివారు ఈ దేశంలో చాలా మందే ఉన్నారు. కానీ పని చేయకుండానే జీతం తీసుకుంటోంది ఓ మహిళా ఉద్యోగి. అది కూడా నెలకు పదివేలో, ఇరవై వేలో కాదు... ఉద్యోగం చేయకుండానే ఏకంగా లక్షా డెబ్బై వేల జీతం తీసుకుంటూ పెత్తనం చేస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే ... నల్గొండ విద్యుత్ శాఖలో పనిచేసే ఓ మహిళా అటెండర్ యేండ్లుగా ఉద్యోగం చేయకుండానే నెల నెలా లక్షా డెబ్భై వేల జీతం తీసుకుంటోంది. ఆమె కూతురు ఇంటలిజెన్స్ అడిషనల్ ఎస్పీ కావడంతో ఇటు పోలీస్ శాఖపైనా ఆ తల్లీ(అటెండర్ ) పెత్తనం సాగిస్తోంది.

కానిస్టేబుల్, జామిందార్లపై ఆమె(అటెండర్ ) పెత్తనం చేస్తుందంటూ ఆ శాఖలో పనిచేయడానికి కూడా కొంత మంది సిబ్బంది జంకుతున్నట్టు సమాచారం. ఆమె వేధింపులు తాళలేక ఇంటలిజెన్స్ లో ఉద్యోగాలు చేయాలంటేనే కొందరు భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగం చేయకుండానే వేతనం తీసుకుంటుందని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు పలు మార్లు ఫిర్యాదులు అందాయి. దీంతో విద్యుత్ ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె తీరులో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో నల్గొండ విద్యుత్ శాఖలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.