షాకింగ్ ఘటన: ఢిల్లీ-లక్నో హైవేపై సూట్ కేసులో మహిళా డెడ్ బాడీ

 షాకింగ్ ఘటన: ఢిల్లీ-లక్నో హైవేపై సూట్ కేసులో మహిళా డెడ్ బాడీ

లక్నో: ఉత్తరప్రదేశ్‎లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు సూట్ కేసులో కుక్కి రోడ్డుపై పడేశారు. ఈ ఘటన హాపూర్ జిల్లాలోని కొత్వాలి నిజాంపూర్ ప్రాంతానికి సమీపంలో వెలుగు చూసింది. నిజాంపూర్ ఏరియాలోని ఢిల్లీ-లక్నో హైవే సర్వీస్ రోడ్‌పై శనివారం (నవంబర్ 16) అనుమానస్పందంగా ఓ సూట్ కేసు కనబడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్ కేసును పరిశీలించగా.. అందులో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనను హాపూర్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) వినీత్ భట్నాగర్ ధృవీకరించారు. 

మహిళా మృతదేహాన్ని కనుగొనడానికి ఒక రోజు ముందే ఆమె చనిపోయి ఉండవచ్చని.. మృతురాలి ఒంటిపై ఉన్న గాయాలు చూస్తే అర్థం అవుతోందన్నారు. సూట్ కేసులో మహిళా డెడ్ బాడీతో పాటు కొన్ని దుస్తులు కూడా గుర్తించామని తెలిపారు. ప్రస్తుతానికి హత్యకు గురైన మహిళ ఎవరనేది తెలియరాలేదని.. సమీపంలోని సీసీటీపీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సూట్ కేసులో మహిళా డెడ్ బాడీని కుక్కి రోడ్డుపై పడవేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళకు గురి అయ్యారు.