
కోల్కతా: రోడ్డు ప్రమాదంలో నృత్యకారిణి, ప్రముఖ మహిళా ఈవెంట్ మేనేజర్ సుతంద్ర చటోపాధ్యాయ మృతి చెందారు. సోమవారం (ఫిబ్రవరి 24) తెల్లవారుజూమున పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. ఆమెతో పాటు కారులో ఉన్న మరో నలుగురు గాయపడ్డారు.
బీహార్‌లోని గయకు ఒక పని మీద వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో సుతంద్ర పల్టీలు కొట్టి నుజ్జునుజ్జు అయ్యింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కారు ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే.. సుతంద్ర చటోపాధ్యాయ మృతిపై ఆమె కారు డ్రైవర్ వాదన మరోలా ఉంది. కొందరు ఆకతాయిలు వేధిస్తూ మా కారును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ మీడియాకు తెలిపాడు. ‘‘ఆదివారం అర్థరాత్రి బీహార్‌లోని గయకు పని మీద వెళ్తున్నాం. ఈ క్రమంలో తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని బుడ్‌బడ్ జాతీయ రహదారి వద్ద ఉన్న పెట్రోల్ పంప్ వద్ద కొందరు దుండగులు మొదట మమ్మల్ని అడ్డుకుని సుతంద్రను దుర్భాషలాడారు. మేము వారిని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే వారు మమ్మల్ని వెంబడించారు.
ALSO READ | ఫ్యాషన్ స్టయిలిస్ట్ తో ఊర్వశి రౌటే
పనాగఢ్ వద్ద మా కారును ఓవర్‌టేక్ చేసి అడ్డుకోవడానికి ప్రయత్నించారు.ఈ క్రమంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. మేం అలాగే ముందు పోతుండగా.. దుండగులు మరోసారి మా వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టడంతో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో సుతంద్ర చటోపాధ్యాయ తీవ్రంగా గాయపడగా.. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాం. కానీ ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే ఆమె మృతి చెందిదని వైద్యులు చెప్పారు’’ అని తెలిపాడు మృతురాలి కారు డ్రైవర్.
ఈవ్-టీజింగ్ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఈ ఘటనపై దుర్గాపూర్-అసన్సోల్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన కారు ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటన స్థలంలో సీసీ టీవీ ఫుటేజీ క్షుణ్ణంగా పరిశీలించామని.. సుతంద్ర ప్రయాణిస్తోన్న కారు ముందున్న మరో కారును ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని వివరణ ఇచ్చారు.
సుతంద్ర కారు డ్రైవర్ చేసిన ఈవ్ టీజింగ్ ఆరోపణలను ఆయన ఖండించారు. మృతురాలి సహచరుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే.. సుతంద్ర కారు డ్రైవర్ ఈవ్ టీజింగ్ జరిగినట్లు ఆరోపిస్తున్న ఓ కారును కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.