న్యాయం జరగలేదని.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

గరిడేపల్లి,వెలుగు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్  చెరువు గ్రామంలో వ్యవసాయ భూమి గొడవ విషయంలో ఆదివారం మహిళా రైతు సూసైడ్​ అటెంప్ట్​చేసింది.  బాధిత మీసాల స్వాతి అనే రైతు  హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రిలో వీడియో సందేశమిస్తూ.. ఆరేండ్లుగా పంట భూమి విషయమై తమకు, బంధువులకు గొడవలు నడుస్తున్నాయని,  హుజూర్ నగర్ కోర్టులో  కేసు నడుస్తున్నదని చెప్పింది. తనకు న్యాయం జరగాలని  నిరుడు కలెక్టర్ కళ్లెదుట పెట్రోల్  పోసుకొని సూసైడ్​ అటెంప్ట్ ​చేయగా  సిబ్బంది అడ్డుకున్నారని తెలిపింది.  వెంటనే తనకు న్యాయం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారని చెప్పింది. కాగా నేటి వరకూ న్యాయం జరగలేదన్నారు. బంధువులు భూమిని దున్నుతుంటే,  ఫొటోలను తీస్తుండగా రాళ్లతో దాడులు చేయడానికి ప్రయత్నించి, బూతులు తిట్టారని పేర్కొంది.  మనస్తాపంతో  సూసైడ్​ అటెంప్ట్​ చేశానని చెప్పింది.