- జామకాయలు తెంపుతుండగా 11 కేవీ వైరు తగలడంతో ప్రమాదం
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో మహిళా హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న రాధ కరెంట్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డారు. అడిషనల్ ఎస్పీ ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్ ఆవరణలో ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కి రాధ జామకాయలు తెంపుతుండగా పైనున్న 11 కేవీ కరెంట్ వైర్లు ఆమెను తాకాయి. దీంతో కరెంట్ షాక్ కు గురై ఆమె కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన సిబ్బంది వెంటనే రాధను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కరీంనగర్ కు తరలించారు. డీఎస్పీ వెంకటస్వామి, రూరల్ సీఐ ఆరిఫ్ అలీఖాన్ ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ ఎస్పీ ప్రభాకరరావు బాధితురాలిని పరామర్శించారు.