
హనుమకొండ సిటీ, వెలుగు: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి ప్రొటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయారు. శుక్రవారం కమిషనరేట్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామెడ్ తాలుకా రాసపల్లి గ్రామానికి చెందిన వంజెం కేషా బాల్యంలోనే చైతన్య నాట్యమండలిలో పని చేస్తూ మావోయిస్టు పార్టీలో చేరినట్లు సీపీ తెలిపారు. కేషా తండ్రి హిడ్మా మావోయిస్టు పార్టీలోనే పని చేసేవాడని, ప్రస్తుతం జైలులో ఉన్నట్లు చెప్పారు. 2017లో పామెడ్ లోకల్ స్క్వాడ్ కమాండర్ గొట్టె కమల ద్వారా కేషా మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఆమెపై కోహెలబేడా పోలీస్స్టేషన్ పరిధిలో అబుజ్ మడ్ ప్రాంతంలో పోలీస్ అధికారిపై కాల్పులు జరిపిన కేసులు ఉన్నాయని చెప్పారు. కేషాపై రూ.4 లక్షల రివార్డు ఉన్నట్లు సీపీ తెలిపారు. మావోయిస్టుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడంతోనే తాను లొంగిపోయినట్లు వంజెం కేషా మీడియాకు తెలిపారు.