బస్సు కిటికీలో నుంచి వాంతులు చేసుకుంటుంటే.. ఎదురుగా వస్తున్న లారీ తలను కొట్టేసింది..!

బస్సు కిటికీలో నుంచి వాంతులు చేసుకుంటుంటే.. ఎదురుగా వస్తున్న లారీ తలను కొట్టేసింది..!

మైసూర్: కొందరికి బస్సు ప్రయాణాలు పడవు. కడుపు తిప్పినట్టయి బస్సు కిటికీల్లో నుంచి తలబయటపెట్టి వాంతులు చేసుకుంటూ ఉంటారు. కానీ.. అలా రన్నింగ్ బస్సులో కిటికీలో నుంచి తల బయటపెట్టడం ఎంత ప్రమాదమో ఈ దుర్ఘటన కళ్లకు కట్టింది. ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మైసూరు నుంచి గుండ్లుపేట్కు వెళ్లేందుకు ఒక మహిళ ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఆమెకు బస్సులో ప్రయాణిస్తుండగా వికారంగా అనిపించి.. కడుపులో తిప్పినట్టయింది.

బస్సులో వాంతులు చేసుకోవడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని భావించిన ఆ మహిళ కిటికీ అద్దాలు తీసి తల బయటపెట్టి వాంతులు చేసుకుంటూ ఉంది. సింగిల్ రోడ్ కావడం, వేగంగా వెళుతున్న బస్సులో నుంచి సడన్గా ఆమె తలబయటపెట్టడంతో ఎదురుగా వస్తున్న ఒక ట్యాంకర్ లారీ దురదృష్టవశాత్తూ ఆమె తలను ఛిద్రం చేసింది. ఈ ఘోర ప్రమాదంలో ఆ మహిళ స్పాట్లోనే చనిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలలో నుంచి మెదడు బయటికొచ్చి ఆమె కూర్చున్న వెనుక సీటులో పడింది. జనవరి 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ALSO READ | కిడ్నాప్ చేసి రూ.6 కోట్లు డిమాండ్ చేసినోళ్లు బస్ ఛార్జీలకు రూ.300 ఇచ్చి విడిచిపెట్టారు..!

ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు నిర్ఘాంతపోయారు. కళ్ల ముందు అంత ఘోరం జరిగేసరికి కొద్దిసేపు అంతా షాక్లోనే ఉండిపోయారు. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే డివిజనల్ కంట్రోలర్, డీఎంఈ, డీటీవో, మైసూర్ అర్బన్ డివిజన్ ఎస్ఓ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. చామరాజనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. రోడ్డుపై వెళుతున్న సమయంలో నిర్లక్ష్యంగా బస్సులో నుంచి తలబయటపెట్టడం వల్ల ఎంత ఘోరం జరిగే అవకాశం ఉందో ఈ ఘటన చెప్పకనే చెప్పింది. బస్సు ప్రయాణం పడక వాంతులు చేసుకునే సందర్భం వస్తే కండక్టర్కు విషయం చెప్పి బస్సు ఆపి దిగి వాంతులు చేసుకోవాలే గానీ ఇలా కిటికీలో నుంచి తల బయటపెట్టడం మంచి అలవాటు కాదని ప్రయాణికులకు పోలీసులు సూచించారు.