- పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘటన
మంథని, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మహిళా రేషన్ డీలర్ దారుణ హత్యకు గురైంది. మృతురాలిని బందెల రాజమణి (37) గా గుర్తించారు. పట్టణంలోని ఎరుకలగూడెంలో సోమవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం బందెల రాజమణి రేషన్ డీలర్ గా పనిచేస్తోంది. ఆమెకి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. రాజమణి భర్త రమేశ్ నాలుగేండ్ల కింద మరణించగా.. అప్పటినుంచి ఆమె రేషన్ డీలర్ గా కొనసాగుతున్నారు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పైడాకుల సంతోష్ అనే ఆటోడ్రైవర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
కాగా సంతోష్.. రాజమణిని వేధించడంతో కొంతకాలంగా ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. మంథనికి వెళ్తున్నానని రాజమణి సోమవారం సాయంత్రం తన పిల్లలకు చెప్పి వెళ్లింది. ఎంతసేపయినా ఆమె ఇంటికి చేరుకోలేదు. పిల్లలు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ క్రమంలో ఎరుకలగూడెంలో పైడాకుల సంతోష్ అద్దె ఇంట్లో రాజమణి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె తనను తిరస్కరించిందన్న కోపంలోనే రాజమణిని సంతోష్ హత్యచేశాడని మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని మంథని సీఐ సతీష్ తెలిపారు.