Viral Video: ఇంట్లో బెడ్ రూం అనుకుందేమో.. ప్రభుత్వ పాఠశాలలో ఈ పంతులమ్మ ఏం చేసిందో మీరే చూడండి..!

Viral Video: ఇంట్లో బెడ్ రూం అనుకుందేమో.. ప్రభుత్వ పాఠశాలలో ఈ పంతులమ్మ ఏం చేసిందో మీరే చూడండి..!

అలీఘర్: విద్య నేర్పే గురువులకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. విద్యాబుద్ధులు నేర్పి తమ పిల్లలను ప్రయోజకులుగా మార్చే గురువులంటే ఎవరైనా గౌరవించకుండా ఎందుకుంటారు చెప్పండి. కానీ.. కొందరు టీచర్ల వ్యవహార శైలి ఆ వృత్తికే తలవొంపులు తెచ్చిపెడుతోంది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ఇలాంటి ఘటనే జరిగింది. తరగతి గదిలో నిద్రపోవడమే తప్పంటే గాలి కోసం పిల్లలతో విసనకర్రతో విసిరించుకుంటూ ఓ టీచర్ తప్పు మీద తప్పు చేసింది. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ పరిధిలో ఉన్న ధనిపూర్ తాలూకాలోని గోకుల్పూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్ ఒకరు మధ్యాహ్నం సమయంలో తరగతి గదిలో  కునుకు తీసింది. చాప ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. మంచిగా చాప వేసుకుని సేద తీరింది. యూపీలో ఎండలు మండిపోతుండటంతో ఉక్కపోతగా ఫీలైన ఈ ప్రబుద్ధురాలు గాలి కోసం పిల్లలతో విసిరించుకుంది. పాపం విసిరివిసిరి చేతులు నొప్పులొచ్చిన ఆ చిట్టి తల్లి అలసిపోయింది. మరో బాలిక ఆ పాప చేతిలో ఉన్న విసనకర్ర తీసుకుని టీచర్కు గాలి తగిలేలా విసురుతూ ఉండిపోయింది. ఆ టీచర్ తల దగ్గర మరో చిన్నారి విసురుతూనే ఉంది. ఇలా.. ఒకరికి ఇద్దరు పిల్లలు విసురుతూ ఉంటే ఈ టీచర్ మంచిగా నిద్రపోతూ కనిపించింది.

 

అదే సమయంలో స్కూల్కు వెళ్లిన ఎవరో లేక అదే పాఠశాలలో పనిచేసే వారో ఆమె రాణిభోగాన్ని చూశారు. సైలెంట్గా ఆ దృశ్యాలను మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇంకేముంది.. ఈ పంతులమ్మను నెటిజన్లు పొట్టుపొట్టు తిడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై, ఆ పాఠశాలల్లో విధులు నిర్వహించే టీచర్లపై ఇప్పటికే కొందరు తల్లిదండ్రుల్లో సదభిప్రాయం లేదని, ఇలాంటి టీచర్ల వల్ల కాస్తోకూస్తో నమ్మకం ఉన్నవాళ్లలో కూడా ఆ నమ్మకం సన్నగిల్లుతోందని నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఈ టీచరమ్మ పనిచేస్తున్న పాఠశాల ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ మంత్రి సందీప్ సింగ్ నియోజకవర్గంలోనే ఉంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై అనుమానాలకు కారణమైంది. ఆ టీచర్ పై ఇప్పటివరకూ విద్యా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.