ఫిన్లాండ్ సర్కారు నడిపేది మహిళలే

యూరప్​లో దాదాపు 60 లక్షల జనాభాతో ఉన్న దేశం ఫిన్లాండ్​. ఇక్కడ మొదటి నుంచీ మహిళలకు సమాన హక్కులున్నాయి. 200 మంది ఎంపీలున్న పార్లమెంట్​లో 93 మంది మహిళలున్నారంటే  అక్కడ ఎంత విలువ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రధానితోపోస్టుతో పాటు ఫైనాన్స్​, హోం వంటి కీలక శాఖల్ని 35 ఏళ్లలోపు మహిళలు నిర్వహిస్తున్నారు.

యూరప్​లో ఓ చిన్న దేశం ఫిన్లాండ్. పెద్దగా వార్తల్లో ఉండదు. అలాంటి ఫిన్లాండ్​ని ఇప్పుడు కొత్త తరం మహిళలు నడిపించబోతున్నారు. కొన్ని రోజుల కిందట ఏర్పడ్డ సర్కార్​లో కీలక పదవులన్నీ ఆడవాళ్లకే దక్కాయి. ముప్ఫయి నాలుగేళ్ల సనా మిరెల్లా మారిన్ ప్రధాని అవడంతో ప్రపంచం అంతా ఒక్కసారిగా ఫిన్లాండ్ వైపు చూసింది. వరల్డ్ యంగెస్ట్ లీడర్స్ జాబితాలో సనా మారిన్ పేరు చేరిపోయింది. ఫిన్లాండ్ ప్రత్యేకత ఇదొక్కటే కాదు. కేబినెట్​లోని మొత్తం 19 మంది మంత్రుల్లో 12 మంది మహిళలే. సనాతోపాటుగా ముఖ్యమైన పదవుల్లో ఉన్న నలుగురు మహిళల వయసు థర్టీ ప్లస్​గా ఉంది. చాలా చిన్నతనంలోనే వీళ్లు దేశాన్ని నడిపించే స్థాయికి చేరారు.

అయిదు పార్టీల ప్రభుత్వం

ఫిన్లాండ్​లో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. మొత్తం ఐదు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి సర్కార్​ను ఏర్పాటు చేశాయి. మొత్తం 200 సీట్లున్న ఫిన్లాండ్ పార్లమెంటు కాలపరిమితి నాలుగేళ్లు. మ్యాజిక్​ ఫిగర్​ 101. 2019 జూన్​లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. సోషల్​ డెమొక్రటిక్​ పార్టీ 40 ఎంపీలతో పెద్ద పార్టీ కాగా, సెంటర్​ పార్టీ (17), గ్రీన్​ లీగ్​ (20), లెఫ్ట్​ అలయెన్స్​ (16), స్వీడిష్​ పీపుల్స్​ పార్టీ (10), మరో ఇండిపెండెంట్​ సాయంతో ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం ఈ కొయిలేషన్​లో 117 మంది ఎంపీలుండడంతో సనా మారిన్​ సర్కార్​కి ఎలాంటి ఢోకా ఉండదు.  ఫిన్లాండ్​లో మగవాళ్లతో సమంగా ఆడవాళ్లకు హక్కులున్నాయి. సొసైటీని మార్చాలన్న కోరిక ఆడవాళ్లలో చాలా బలంగా ఉంటుందన్నారు సోషల్ సైంటిస్టులు. జెండర్ బయాస్​కి  ఫిన్లాండ్​ పాతర వేసి చాలా కాలమైంది. దీంతో ఆడవాళ్లు ముఖ్యంగా థర్టీ ప్లస్ వయసున్న వాళ్లు పాలిటిక్స్ వైపు ఎక్కువగా ఆకర్షితులు కావడం, ఎన్నికల్లో గెలిచి కీలక పదవులు చేపట్టడం జరుగుతోందంటున్నారు.

చదువుకు టాప్ ప్రయారిటీ

నార్త్ యూరప్​లోని  ఫిన్లాండ్​లో చదువుకు టాప్ ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ టీచర్ ఉద్యోగానికి చాలా క్రేజ్ ఉంది. దేశంలో ఎక్కడా ప్రైవేటు స్కూళ్లంటూ ఉండవు. అన్ని స్కూళ్లను గవర్నమెంటే నడుపుతుంది. అంతేకాదు చిన్నారుల  ఆరోగ్యానికి  ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుంది. దాదాపుగా ప్రతి స్కూల్​లో ఒక కన్సల్టెంట్​ డాక్టర్ ఉంటాడు.  ఫిన్లాండ్​లో పార్లమెంటరీ డెమొక్రసీ అమల్లో ఉంది. దేశానికి ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ అధికారాలు ఏమీ ఉండవు.  ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీ. జనాభాలో ఎక్కువ మంది ఫిన్నిష్ భాష మాట్లాడతారు. స్వీడన్ ఇక్కడ రెండో అధికార భాష. జనాభాలో మెజారిటీ ప్రజలు క్రిస్టియన్లు. 1950 వరకు ఇక్కడ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఫిన్లాండ్ పరిశ్రమలవైపు అడుగులు వేయడం మొదలెట్టింది

పాలిటిక్స్​లో అన్నా మజా లాంగ్ ఇన్నింగ్స్

ఫిన్లాండ్ పాలిటిక్స్​లో పెద్దావిడగా పేరున్న అన్నా మజా హెన్రిక్సన్ కూడా మారిన్ కేబినెట్​లో చేరారు. హెన్రిక్సన్​ది పాలిటిక్స్​లో లాంగ్ ఇన్నింగ్స్. 2007 నుంచి ఆమె పార్లమెంటుకు ఎన్నికవుతున్నారు. 2011నుంచి 14 వరకు ‘లా’ మినిస్టర్​గా పనిచేశారు. కొయిలేషన్ మినిస్ట్రీలో భాగంగా ఉన్న ‘స్వీడిష్  పీపుల్స్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్ (ఎస్పీఎఫ్​)’కు ఆమె చైర్​పర్సన్​గా వహిస్తున్నారు.

ఫైనాన్స్ మినిస్టర్​గా కత్రి కుల్ముని

సనా మారిన్ కేబినెట్​లో ఫైనాన్స్ మినిస్టర్​గా బాధ్యతలు చేపట్టిన కత్రి కల్ముని వయసు 32 ఏళ్లు. కూటమిలోని ‘సెంటర్ పార్టీ’కి ఆమె చైర్​పర్సన్​గా ఉన్నారు. కత్రి కల్ముని సోషల్ సైన్సెస్​లో డిగ్రీ తీసుకున్నారు. 2015లో ఆమె తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ ఏడాది మరోసారి గెలిచి అప్పటి రినే ప్రభుత్వంలో ఫైనాన్స్​ మినిస్టర్​గా పనిచేశారు. కొత్త  కేబినెట్​లోనూ అదే పొజిషన్​లో కంటిన్యూ అవుతున్నారు.

ఎడ్యుకేషన్ మినిస్టర్​గా లీ అండర్సన్

32 ఏళ్ల లీ అండర్సన్ ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్​గా ఉన్నారు. ఈమె ‘లెఫ్ట్ అలయన్స్’కు చెందిన నాయకురాలు. స్టూడెంట్​గా ఉన్నప్పటి నుంచే లీ పాలిటిక్స్ పట్ల ఆసక్తి చూపేవారు. ‘లెఫ్ట్ అలయన్స్’ యూత్ వింగ్ ప్రెసిడెంట్​గా కూడా పనిచేశారు. రినే కేబినెట్​లో విద్యా మంత్రిగా చేరారు. మారిన్ ప్రభుత్వంలో మరోసారి ఎడ్యుకేషన్ మినిస్టర్​గా లీ అండర్సన్ చేరారు.

పేదరికం నుంచి పైకొచ్చిన మరియా

‘గ్రీన్ లీగ్’ పార్టీకి చెందిన మరియా ఒహిసలో ఫిన్లాండ్​కు ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్నారు. మరియా 1985లో  ఈస్ట్రన్ హెల్సింకీ ప్రాంతంలోని వెసాలాలో పుట్టారు. బాల్యం అంతా పేదరికంలో గడిచింది. తల్లిదండ్రులు విడిపోయారు. చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ తల్లే ఆమెను పెంచింది. మరియాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. కాలేజ్ రోజుల్లో ఫుట్​బాల్, అథ్లెటిక్స్​లో ఉత్సాహంగా పాల్గొనేది. సోషియాలజీలో డాక్టరేట్ చేసిన మరియా 2008లో గ్రీన్ పార్టీలో చేరి యూత్ వింగ్​లో చురుగ్గా పనిచేశారు. 2015 నాటికి గ్రీన్ పార్టీ వైస్ చైర్మన్​ కాగలిగారు. ఈ ఏడాది హెల్సింకీ నుంచి పార్లమెంటుకు ఎన్నికై, అప్పటి రినే కేబినెట్​లో ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్​గా చేరింది. మారిన్ ప్రభుత్వంలో  కూడా అదే శాఖ నిర్వహిస్తున్నారు.