
ఎర్రటి నిప్పు కణికలను వదులుతున్నట్టు.. అగ్ని గోళాలను విసురుతున్నట్టు.. భగభగలాడిపోతున్నడు చందమామ. అరె, చల్లటి వెన్నెలను పంచే జాబిల్లి ఎర్రగా కాలిపోవడమేంటి? అన్న డౌట్ వచ్చిందా! అవును, మరి! అంతరిక్షంలో వెలువడే గామా కిరణాల వల్ల చంద్రుడిపై ఇలాంటి ఎఫెక్ట్ పడుతుందట. ఆ గామా కిరణాలే గానీ మనకు కనిపిస్తే సూర్యుడి కన్నా ప్రకాశవంతంగా, ఎర్రగా కనిపిస్తాడట చందమామ. ఆ గామా కిరణాల ఫలితంగానే చందమామ ఇలా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలను నాసా విడుదల చేసింది. మరి, గామా కిరణాలు మనకు కనిపించనప్పుడు, ఇదెలా సాధ్యమైందన్న ప్రశ్న కూడా ఈ పాటికే వచ్చి ఉండాలి కదా. మనకు కనిపించవు గానీ, కొన్ని రకాల టెలిస్కోపులకు కనిపిస్తాయి కదా. అదే ఇది. నాసా ఫెర్మి టెలిస్కోపు ఈ గామా కిరణాల వెలుగుల్లో నిప్పుకణికలా మెరిసిపోతున్న చంద్రుడిని క్లిక్‌మనిపించింది. దాదాపు పదేళ్లుగా ఈ టెలిస్కోపు చంద్రుడు, చంద్రుడిపై పడే ఔటర్ స్పేస్ నుంచి వచ్చే కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చేస్తోంది. టెలిస్కోపు తీసిన ఈ ఫొటోలను ఇటలీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్టులు పరిశీలించి ఆ విషయం తేల్చారు. గామా కిరణాల వల్ల వెలువడిన 3.1 కోట్ల ఎలక్ట్రాన్ వోల్టుల శక్తితో జాబిల్లి ఎర్రగా మారినట్టు కనిపించాడట. ఆ శక్తి మామూలుగా మన కంటికి కనిపించే వెలుతురు కన్నా కోటి రెట్లు శక్తిమంతమైనదట.