పిల్లల్ని కనండి.. లేదంటే చైనా, జపాన్‌లా సమస్యలొస్తయ్: ఏపీ సీఎం చంద్రబాబు

పిల్లల్ని కనండి.. లేదంటే చైనా, జపాన్‌లా సమస్యలొస్తయ్: ఏపీ సీఎం చంద్రబాబు
  • ఫర్టిలిటీ రేటు తగ్గిపోతోంది
  • పరిస్థితి ఇట్లే కొనసాగితే చైనా,జపాన్​లా సమస్యలొస్తయ్
  • హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్  సమిట్​లో ఏపీ సీఎం  

హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఫర్టిలిటీ రేటు(ఒక్కో మహిళ జన్మనిచ్చే పిల్లల సంఖ్య) ప్రమాద స్థాయికి పడిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జపాన్, చైనా దేశాల్లో మాదిరిగా ఇక్కడా సమస్యలు స్టార్ట్ అవుతాయన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్’లో పాల్గొని ఆయన పలు అంశాలపై మాట్లాడారు. జపాన్, చైనా దేశాల జనాభాలో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని, ప్రస్తుతం మన దేశంలోనూ సౌత్ లో ఈ సమస్య మొదలైందన్నారు.

‘‘మన దేశంలో 1991 నాటికి ఫర్టిలిటీ రేటు 5.2గా ఉండేది. కానీ ఇప్పుడు అది 2.5కు పడిపోయింది. సాధారణంగా ఫర్టిలిటీ రేటు 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. అందుకే ఇప్పుడు మనం బార్డర్ లైన్ కు వచ్చినట్టయింది. ఫర్టిలిటీ రేటు 2.5 కంటే తక్కువకు పడిపోతే ఇక జనాభా పెరుగుదల అనేదే ఉండదు. అదే జరిగితే సమాజానికి ప్రమాదకరం” అని చంద్రబాబు హెచ్చరించారు.  

పాపులేషన్ మేనేజ్మెంట్ అవసరం.. 

గతంలో తాను ‘బ్రేక్ సైలెన్స్ టాక్ ఎబౌట్ ఎయిడ్స్’ అనే నినాదాన్ని ఇచ్చానని.. ఇప్పుడు ‘బ్రేక్ సైలెన్స్ టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్’ అని పిలుపునిస్తున్నానని చంద్రబాబు అన్నారు. “పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు. ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టాను. ఇప్పుడు ఆ నిబంధన తొలగించాను. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటే తప్ప పోటీకి అర్హత లేదని పెట్టాలి ఇప్పుడు’’ అంటూ ఆయన నవ్వులు పూయించారు. 

2029 ఎన్నిలకు ఇప్పట్నించే ప్లాన్స్..   

బీజేపీకి మాజీ ప్రధాని వాజ్ పేయి పునాదులు వేస్తే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ బలోపేతం చేశారని చంద్రబాబు అన్నారు. మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ‘‘నరేంద్ర మోదీ మా లీడర్. ఆయన ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాం. హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి సీఎంల సమావేశం జరిగింది. 

నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో 2029 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలనే విషయంపై మోదీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాం. రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడు పార్టీలను కలిపారు. దాని ఫలితం ఇప్పుడు చూశాం. ఏపీ ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని మేం ముందుగానే ఊహించాం. జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని అనుకున్నాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.