- నష్టపోతున్న రైతులు
- పత్తాలేని అగ్రికల్చర్ ఆఫీసర్లు, రైతుబంధు సమితులు
భద్రాచలం,వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో డీఏపీ కొరత వేధిస్తోంది. ఎరువుల కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఫర్టిలైజర్ షాప్ఓనర్ల షరతులతో నష్టపోతున్నా వ్యవసాయశాఖ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. డీఏపీ కొరత ఉందని ఆఫీసర్లు చెబుతున్నా, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపు యజమానులు రైతుల అవసరాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని డీఏపీతో పాటు పురుగు మందులను అంటగడుతున్నారు.
మొదటి నుంచీ కొరతే..
జిల్లా వ్యవసాయశాఖ వానాకాలం పంటల ప్రణాళికను ప్రకటించినప్పటి నుంచే జిల్లాలో డీఏపీ కొరత ఉంది. 14,280 మెట్రిక్ టన్నుల డీఏపీ జిల్లాకు అవసరం ఉంటుందని పేర్కొన్న ఆఫీసర్లు, 729 మెట్రిక్ టన్నులే ఉన్నట్లుగా తమ నివేదికల్లో వెల్లడించారు. 1,71,196 ఎకరాల్లో వరి, 38 వేల ఎకరాల్లో జొన్న, 1,75,619 ఎకరాల్లో పత్తి, 806 ఎకరాల్లో పెసర, 1,614 ఎకరాల్లో మినుము, 15,122 ఎకరాల్లో కంది, 22,784 ఎకరాల్లో మిరప, 442 ఎకరాల్లో నువ్వులు, 634 ఎకరాల్లో అలసంద, 53,242 ఎకరాల్లో ఆయిల్‌పామ్, 48,975 ఎకరాల్లో ఇతర పంటలతో కలిపి జిల్లాలో 5,50,726 ఎకరాలు సాగవుతోంది. ఇందుకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉంది. గత నెలలో యూరియా కొరత వేధించింది. తాజాగా డీఏపీ మార్కెట్లో దొరకడం లేదు. గోదావరి వరదల కారణంగా 7,417 ఎకరాల్లో పత్తి, 3305 ఎకరాల్లో వరి, 7 ఎకరాల్లో పెసర పంటలు దెబ్బతిన్నాయి. తిరిగి పత్తి విత్తనాలు వేసుకోగా, ఇవి పెరుగుతున్న క్రమంలో డీఏపీ అవసరం ఉంది. ఇందుకోసం గోదావరి పరివాహక ప్రాంతంలోని రైతులు తమ ప్రాంతాల్లోని ఎరువుల దుకాణాలకు వెళ్తే డీఏపీ లేదని అంటున్నారు.
పురుగు మందులు అంటగడుతున్రు..
ఒక కట్ట డీఏపీ రూ.1350లు ఉంది. ఐదు కట్టలు కావాలంటే రూ.1800ల విలువ చేసే పురుగు మందు కొనాలని ఫర్టిలైజర్ షాప్ యజమానులు నిబంధన పెడుతున్నారు. మిర్చి ఏతలు ఇప్పుడే మొదలు కాగా, దుక్కుల్లో వేసేందుకు ఇతర ఎరువులు తీసుకోవాలని షరతులు పెడుతున్నారు. అవి కొంటేనే డీఏపీ లేదంటే ఇవ్వం అని చెబుతున్నారు. ఇప్పటికే వరదల్లో పంటలు కోల్పోయి, అప్పు చేసి మళ్లీ పంటలు సాగు చేస్తున్న రైతులు ఫర్టిలైజర్ షాప్ ఓనర్లతో మరింత నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.