రాష్ట్ర సర్కారు గత ఎనిమిదేండ్లలో ఒక్క సారి కూడా రాష్ట్ర ప్రజల, పర్యావరణ కోణంలో సేంద్రీయ వ్యవసాయ విధానాల రూపకల్పనకు ప్రయత్నమే చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో రసాయన ఎరువులు, పురుగు, కలుపు విషమందుల వాడకం విపరీతంగా పెరుగుతున్నది. బీటీ పత్తిలో వాడే గ్లైఫోసెట్ కలుపు విషాన్ని క్యాన్సర్ కారకంగా ప్రకటించి నిషేధించినా, అది మార్కెట్ లో ఇంకా దొరుకుతూనే ఉంది. ప్రపంచ దేశాలు నిషేధించిన అనేక విషాలు తెలంగాణలో వివిధ పంటలపై వాడుతున్నారు. కానీ మన సర్కారు ఈ విషయాలను ఇంకా సీరియస్గా తీసుకోవడం లేదు.
ప్రపంచమంతా పర్యావరణ సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నది. వాతావరణంలో వేడిని తగ్గించే ప్రయత్నం చేయండి, గాలిలోకి గ్రీన్ హౌస్ వాయువులను వదలడాన్ని తగ్గించండి అని అంతా హెచ్చరిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకు సాగడం లేదు. తెలంగాణలో నీరు ఎక్కువ అవసరమయ్యే వరి, పత్తి పంటలను, నీరు ఎక్కువ నిల్వ ఉండే భారీ రిజర్వాయర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. వేసవిలో కూడా నీరు బాగా కావాల్సిన ఆయిల్ పామ్ సాగును 20 లక్షల ఎకరాలకు పెంచుతామని చెబుతున్నది. ఐదు లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు తవ్వుతామనీ అంటున్నది. సాగు నీరు అందించడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతూ పోతున్నది.ఎంత భారీ వర్షాలు పడినా, మన నేలల స్వభావం రీత్యా తిరిగి కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడం చూస్తున్నాం. యాసంగిలో వరి సాగు వల్ల భూగర్భ జలాలు వేగంగా పడిపోవడం, బోర్లు ఎండిపోవడం, ఫలితంగా పంటలు ఎండిపోవడం జరుగుతున్నదే. ఎక్కడికక్కడ వర్షపు నీటిని ఒడిసి పట్టడం, తక్కువ నీరు అవసరమయ్యే పంటలు పండించడం లాంటి సాగు పద్ధతులను అనుసరించడం చేయాలి.
ఎరువులు వాడకం దేశ సగటు కంటే ఎక్కువ..
విష పూరిత రసాయన వ్యవసాయ పద్ధతులను మానుకోవాలని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పర్యావరణ వేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం, గాలి, నీరు మొత్తం వాతావరణం వీటి వల్ల విషపూరితమైపోతున్నాయని ఇప్పటికే అనేక సాక్ష్యాలు ఉన్నాయి. వీటి వల్ల భూములు నిస్సారం అవుతున్నాయి. తేనెటీగల సంఖ్య తగ్గిపోతున్నది. మనుషులు, పశువుల్లో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. క్యాన్సర్ విస్తరిస్తున్నది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయాలను ఇంకా సీరియస్గా తీసుకోవడంలేదు. గత ఎనిమిదేండ్లలో ఒక్క సారి కూడా రాష్ట్ర ప్రజల, పర్యావరణ కోణంలో సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నాలే జరగలేదు. ఫలితంగా రాష్ట్రంలో రసాయన ఎరువుల వాడకం పెరుగుతూ పోతున్నది. ప్రభుత్వ నివేదికల ప్రకారమే ఇప్పటికే 2,70,000 టన్నుల డీఏపీ, 17,50,000 టన్నుల యూరియా, 2,60,000 టన్నుల ఎంఓపీ, 13,00,000 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నాం. ఎకరానికి ఎరువుల వినియోగంలో దేశ సగటు 53.9 కిలోలు ఉంటే, రాష్ట్ర సగటు ఎకరానికి177 కిలోలు. రాష్ట్రంలో ఎకరానికి 100 కిలోల కంటే ఎక్కువ ఎరువులు వాడుతున్న జిల్లాలు17 ఉంటే, 200 కిలోల కంటే ఎక్కువ వాడుతున్న జిల్లాలు 6 ఉండటం గమనార్హం.
బలహీనమైన విస్తరణ వ్యవస్థ
యూనివర్సిటీకి కేటాయించే నిధుల్లో 50 శాతం సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై పరిశోధనకు కేటాయించాలి. దేశ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయంలో పరిశోధనా ఫలితాలు, సేంద్రీయ రైతుల అనుభవాలు పత్రికల్లో తప్పకుండా ప్రచురించాలి. కేంద్ర ప్రభుత్వం రసాయన ఎరువుల కోసం అందించే సబ్సిడీలో 50 శాతం సేంద్రీయ వ్యవసాయం కోసం కేటాయించి, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా అందించాలి. రాష్ట్రంలో వ్యవసాయం సరిగా జరగాలంటే, పర్యావరణహితమైన సేంద్రీయ వ్యవసాయం విస్తరించాలంటే, విస్తరణ వ్యవస్థ బలంగా ఉండాలి. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు, సుస్థిర,సేంద్రీయ వ్యవసాయం వైపు నడిపించడానికి తగిన నిర్ణాయక అధికారాలు ఈ శాఖ సిబ్బందికి లేవు. రైతులు అడిగే ప్రశ్నలకు ఈ శాఖ అధికారుల దగ్గర సమాధానాలు లేవు.
విష రసాయనాల వినియోగం డబుల్
పంటల సస్యరక్షణలో పురుగు, కలుపు విషాల వాడకం విపరీతంగా పెరుగుతున్నది. 2014–15లో 2,806 టన్నుల యాక్టివ్ ఇంగ్రిడెంట్ వాడిన తెలంగాణ, 2019–2020 నాటికి 4,915 టన్నులకు చేరుకుంది. అంటే దాని అర్థం మనం పూర్తిగా విషాహారం మీద ఆధారపడి బతుకుతున్నాం అన్నమాట. బీటీ పత్తిలో వాడే గ్లైఫోసెట్ కలుపు విషాన్ని క్యాన్సర్ కారకంగా ప్రకటించి నిషేధించినా, అది మార్కెట్ లో దొరుకుతూనే ఉంది. ప్రపంచ దేశాలు నిషేధించిన అనేక విషాలు తెలంగాణలో వివిధ పంటల్లో వినియోగంలో ఉంటున్నాయి. వ్యవసాయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో అగ్రికల్చర్వర్సిటీ రూపొందించే వ్యవసాయ పంచాంగంలో పురుగు విషాలను, కలుపు విషాలను రికమెండ్ చేస్తున్నారు. దాన్ని పవిత్ర గ్రంథంగా భావించే వ్యవసాయ శాఖ వాటిని రైతులకు సిఫారసు చేస్తున్నది. అధిక దిగుబడుల ఆశతో, కూలీ ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో రైతులు వాటిని విచక్షణా రహితంగా వాడుతున్నారు. వరి, పత్తి, కూరగాయల పంటల్లో రసాయనాల వాడకం బాగా పెరిగింది. వాటిని తగ్గించడానికి పంటల మార్పిడిలో భాగంగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
వెయ్యి మంది రైతులకో ఆఫీసర్ ఉండాలె..
రాష్ట్ర స్థాయిలో సాగైన పంటల వివరాలు, వాస్తవ సాగుదారుల వివరాలు తప్పుల తడకగా ఉండటానికి, విస్తరణ సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాలే కారణం. 3 ఏండ్ల క్రితం కొత్త తరం యువత ఉత్సాహంగా వ్యవసాయ విస్తరణ విభాగంలో చేరింది. వారు నిజాయితీగా రైతులకు సేవలు అందించాలని భావించారు. కానీ ఆ శాఖ, వారి ఉత్సాహాన్ని నీరు కార్చేసింది. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్లుగా పని చేసే ధోరణి కనిపిస్తున్నది. వర్క్ టార్గెట్లు ఇస్తున్నది కానీ, దానికి తగిన టైమ్ ఇవ్వడం లేదు. దీంతో ఒత్తిడితో చేయడం వల్ల వాస్తవ సమాచారం రావడం లేదు. 5000 ఎకరాలకు ఒకరిని పెట్టడం వల్ల రైతులకు పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. కనీసం గ్రామ పంచాయతీకి ఒకరు చొప్పున లేదా కనీసం 2500 ఎకరాలకు ఒకరు లేదా 1000 మంది రైతులకు ఒకరు చొప్పున విస్తరణ అధికారులను నియమించాలి. ఏఈఓలు అందరూ వ్యవసాయ విద్య చదువుకొని వచ్చారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకునే పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వడానికి వారికి ఎక్కువ సమయం ఉండాలి. కానీ ఇప్పుడు వారు ఎక్కువగా రైతుల వివరాలు సేకరించడానికి క్లరికల్ వర్క్ చేస్తున్నారు. ఈ పని చేయడానికి, శిక్షణ ఇస్తే ఇంటర్ మీడియట్ విద్యార్థులైనా సరిపోతారు. వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు స్థానికంగా ఉండే రైతు సహకార సంఘాలతో, రైతు ఉత్పత్తి దారుల కంపెనీలతో కలిసి పని చేయగలిగితే ఇంకా ఎక్కువ విస్తరణ సేవలు రైతులకు అందుతాయి. –కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక