మానకొండూర్​లో బీఆర్ఎస్‌‌‌‌కు షాక్

మానకొండూర్​లో  బీఆర్ఎస్‌‌‌‌కు షాక్
  • పార్టీకి రాజీనామా చేసిన ఇల్లంతకుంట, మానకొండూర్ ఎంపీపీలు
  •         పీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరిక
  •     ఇప్పటికే బీఆర్ఎస్‌‌‌‌ను వీడిన మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు 

కరీంనగర్, వెలుగు: మానకొండూర్​ నియోజకవర్గ బీఆర్ఎస్‌‌‌‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. గత నెలలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీఆర్ఎస్‌‌‌‌కు రాజీనామా చేయగా, తాజాగా ఇద్దరు ఎంపీపీలు రిజైన్ చేయడం కలకలం రేపుతోంది. వీరితోపాటు ఇప్పటికే గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల్లో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ లో ఇన్నాళ్లు రగులుతున్న అసంతృప్తి ఎన్నికల ముందు రాజీనామాల రూపంలో బయటపడుతోందనే చర్చ జోరుగా  సాగుతోంది.

ఇద్దరు ఎంపీపీలు కాంగ్రెస్‌‌‌‌లోకి..

ఇల్లంతకుంట ఎంపీపీ వూట్కూరి వెంకటరమణా రెడ్డి, మానకొండూరు ఎంపీపీ ముద్దసాని సులోచన శ్రీనివాస్ రెడ్డి, వెల్జిపూర్ మాజీ సర్పంచ్ గుండా వెంకటేశ్‌‌‌‌, సింగిల్ విండో  డైరెక్టర్ జంగిటి కొమురయ్యతో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు గురువారం బీఆర్ఎస్‌‌‌‌కు రాజీనామా చేశారు. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్‌‌‌‌లో ఆపార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, ఇల్లంతకుంట ప్యాక్స్​చైర్మన్ రాఘవరెడ్డి,  గన్నేరువరంలో ఐదుగురు సర్పంచులు, పలువురు ఎంపీటీసీలు బీఆర్ఎస్‌‌‌‌ను వీడి కాంగ్రెస్ లో చేరారు. 

ALSO READ: బీఆర్ఎస్​లోకి రావుల చంద్రశేఖర్ రెడ్డి!

బీజేపీలోకి ఆరేపల్లి.. 

బీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన ఆరేపల్లి తాజాగా బీజేపీలో చేరారు. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని గత నెలలో ఆయన బీఆర్ఎస్‌‌‌‌కు రాజీనామా చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని పలుమార్లు ప్రకటించిన ఆయన.. బీజేపీ నుంచి టికెట్ విషయంలో హామీ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్  సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతోపాటు మాజీ జడ్పీటీసీ జోగిరెడ్డి బీజేపీ లో చేరారు.