పుట్టి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్న తెలంగాణకు 21 రోజుల దశాబ్ది ఉత్సవాల పండుగ చేస్తున్నది కేసీఆర్ సర్కారు. మరో నాలుగు నెలల్లో ఓట్ల పండుగ రాబోతున్న వేళ ఉత్సవాల అసలు ఉద్దేశం అందరికీ తెలిసిందే. ఈ తొమ్మిదేండ్లలో దగాపడ్డదెవరు? దండుకున్నదెవరనేదే నేడు మనముందు ఉన్న ప్రశ్న. నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రలైనట్టు తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తదన్న కేసీఆర్ మాటలు నమ్మి ప్రాణాలకు తెగించి కొట్లాడిన నిరుద్యోగులకు రాష్ట్రం వచ్చి తొమ్మిదేండ్ల తర్వాత కూడా ఉద్యోగాలు, ఉపాధి లేకపాయె! నిరుద్యోగ భృతి ఇస్తమంటే రెండోసారి నమ్మి నిలువు దోపిడీకి గురయ్యారు. మలి దశ ఉద్యమానికి ఊపిరిలూదిన యూనివర్సిటీల్లో.. చదువు చెప్పే సార్ల కోసం, సౌలత్ల కోసం విద్యార్థులు రోజూ ఆందోళనలు చేయాలి? సర్కారు చదువులు బాగుపడలేదు.. చదువుకున్నోళ్లకు నౌకర్లు లేవు. తొమ్మిదేండ్లుగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయకుండా నాన్చిన సర్కారు.. ఎన్నికల ఏడాది ఓట్ల కోసం నోటిఫికేషన్లు వేస్తే.. అన్నీ లీకేజీలే!
నీళ్లు ఏమైనయి?
ఒక్క కాళేశ్వరం పేరు చెప్పి అన్ని నీటిపారుదల పథకాలను నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర సర్కారు.. చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు ఇవ్వలేదు. 2019 జూన్21న ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాలుగేండ్లలో 153.58 టీఎంసీలను మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన సర్కారు.. అందులో 50 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రం పాలుజేసింది. దాదాపు లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినా ఇప్పటి వరకు ఏ సీజన్లోనూ 75 వేల ఎకరాలకు మించి ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లివ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలదీ ఇలాంటి పరిస్థితే. నదీ జలాల వాటాల విషయంలో తెలంగాణ సర్కారు అలసత్వం వహించి.. కృష్ణా నీటిని ఆంధ్రా దోచుకునేందుకు అవకాశం కల్పించింది. మిగులు బడ్జెట్తో మొదలైన తెలంగాణ ప్రభుత్వం.. ఈరోజు లక్షల కోట్ల అప్పుల్లోకి దిగజారింది.
ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు చేయడంతోపాటు, కార్పొరేషన్లు సృష్టించి ఎక్కడ దొరికితే అక్కడ ఎడాపెడా అప్పులు చేసింది. రెండు నెలల క్రితం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. తెలంగాణ ఆర్థి పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు. 2022 అక్టోబర్ నాటికి మెుత్తం తెలంగాణ రాష్ట్ర అప్పు రూ. 4,33,817.6 కోట్లని, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు మరో లక్షా 50 వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ముందూ వెనుకా ఆలోచించకుండా సర్కారు ఏయేటికాయేడు ఎడాపెడా అప్పులు దూసి తెస్తుండడంతో రాష్ట్రం రుణ ఊబిలో కూరుకుపోతోంది.
ఈ అప్పులకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులకే బడ్జెట్‌లో 7 శాతం.. రాష్ట్ర రాబడుల్లో దాదాపు 25 శాతం హరించుకుపోతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతుబంధు పేరుతో భూస్వాములకు సర్కారు నిధులు పంచుతున్నది. దళిత బంధు పేరిట పార్టీ కార్యకర్తలకు రూ.10 లక్షల చొప్పున పంచుతున్నది. ఉన్న భవనాలను కూల్చడం, కొత్తవి కట్టడం, అంచనాలు పెంచడం, కమీషన్లు దండుకోవడం తెలంగాణ సమాజం చూస్తున్నది. తెలంగాణ అభివృద్ధి పనులైన ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు చేపట్టిన ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇవాళ దేశంలో కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకోగా.. తెలంగాణ బడుగు, బలహీన, బహుజన వర్గాలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నాయి.
ఉద్యమకారులకు గుర్తింపేది?
ఉద్యమంలో కొట్లాడిందెవరు? లాఠీదెబ్బలు తిన్నది, తూటాలకు ఎదురు నిలబడ్డది, చివరకు ప్రాణ త్యాగాలు చేసిందెవరు? ఇవాళ తెలంగాణ ఎవరి చేతిలో ఉన్నది. ఉద్యమకారులను అణగదొక్కిన, ఉద్యమాన్ని అవమానించిన, కర్రలు, ఇనుప రాడ్లతో ఉద్యమకారులను చావబాదిన సోకాల్డ్ లీడర్లు ఇవాళ బంగారు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల
చైర్మన్లు. నిజాంల నుంచి నేటి వరకు పాలించేవాడే మారాడు కానీ.. నియంతృత్వ పాలన మారలేదు. ప్రజలారా.. ఇకనైనా మేల్కొందాం.
- కమల్ మేడగోని