మాఘమాసం తెలుగు క్యాలండర్లో 11 వ నెల. హిందువులకు.. ఆధ్యాత్మికంగా కార్తీకమాసం ఎంత ముఖ్యమో.. మాఘ మాసానికి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో ...ఈ ఏడాది ( 2025) ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి తిథి రోజున సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం నాలుగో తేదీన రథ సప్తమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. మాఘమాసంలో వచ్చే పండుగలు.. పర్వదినాల.. వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. . .
మాఘమాసం.. ఫిబ్రవరి 2025 లో వసంత పంచమి.. రథసస్తమి మాఘ పూర్ణిమ, మహా శివరాత్రి, మహా కుంభమేళా ముగింపు వంటి ప్రధాన పండుగలు కూడా రానున్నాయి. ఈ పవిత్రమైన రోజులన్నీ ఉపవాసానికి ఎంతో ముఖ్యమైనవి. వీటితో పాటు మాఘమాసంలో పుణ్య స్నానం ప్రధానమైన ఆచారం. పుణ్య నదుల్లో ( గోదావరి, కృష్ణ, తుంగభద్ర మొదలైనవి) స్నానాలు ఆచరిస్తారు. వెళ్లేందుకు అవకాశం లేని వారు పొద్దున్నే ఇంటి దగ్గర మోటారు దగ్గర కాని, బావి దగ్గర గాని కుళాయి దగ్గర కాని స్నానం చేయవచ్చు.
వసంత పంచమి.. ( ఫిబ్రవరి 3) : మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు. సరస్వతీదేవి పుట్టిన రోజని పురాణాల్లో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవికి పూజ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. జగత్తంతా నడవడానికి బుద్ధి ముఖ్యం. ఆ బుద్ధి సక్రమంగా పనిచెయ్యడానికి సరస్వతీదేవి అనుగ్రహం ముఖ్యం కాబట్టి, ఆనాడు సరస్వతీ ఉపాసన చెయ్యాలని పండితులు చెబుతున్నారు. . అంతేకాదు మహాకుంభమేళాలో నాలుగో రాజస్నాన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
రథ సప్తమి..(ఫిబ్రవరి 4): ఈ పవిత్రమైన రోజున సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని అరసవల్లి, ఒడిశాలోని కోణార్క్, గుజరాత్ రాష్ట్రంలోని సూర్య దేవాలయాల్లో రథ సప్తమి రోజున వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అదితి, కశ్యపుల పుత్రుడైన సూర్యుడు లోకాలకు వెలుగు నివ్వడం కోసం ... రథ సప్తమి రోజున రథమెక్కి ఆకాశంలో సంచారానికి బయలు దేరాడని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి నాడు రేగుపళ్ళు, జిల్లేడు ఆకులు నెత్తిమీద పెట్టుకుని నదీ స్నానం చేయాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
శ్లోకం
సప్తే సప్తే త్రిమూర్త్యాత్మన్ సప్తాశ్వరథవాహన!
సప్త్రజన్మకృతం పాపం స్నానేనైవ వినాశయ.!!
రథసప్తమీ నదీస్నానం చేయడం ఉత్తమం. పై శ్లోకమును చదువుచూ నదీ స్నానం చెయ్యాలి. ఇంటికి వెళ్ళి అవుపాలతో పాలపొంగలి చేసి సూర్యునికి 12 చిక్కుడాకులలో పెట్టి నివేదన చెయ్యాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఆరోగ్యమును కోరేవారు సూర్యుని ఆరాధించాలి.సూర్య భగవానుడు ... బ్రహ్మ ..విష్ణు ..మహేశ్వర స్వరూపుడని... వేదాలు ప్రశంసించాయి. బుగ్వేదంలోని మహాసౌరమంత్రాలు, యజుర్వేదంలోని అరుణకేతుకం అనే అరుణ ప్రశ్నశాస్త్రంలో సూర్య దేవుని మహిమ అనేక విధాలుగా ఉందని ప్రశ్నా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు
భీష్మ ఏకాదశి( ఫిబ్రవరి 8): మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని పనుల్లో విజయం సాధించడమే కాకుండా, శుభ ఫలితాలను పొందుతారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల కచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉండి..ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత మరణించాడు. అందుకే మాఘస్నానానంతరం భీష్మునికి తర్పణం చెయ్యాలి. తిలలతో తర్పణం చేయాలి.
శ్లోకం:
వైయాఘ్రపాదగోత్రాయ సాంకృతి ప్రవరాయచ,
గంగాపుత్రాయ భీష్మాయ, ప్రదాస్యేహం తిలోదకమ్,
అపుత్రాయ దదామ్యేత జం భీష్మాయ వర్మణే ॥
అనే శ్లోకం మూడుసార్లు చదివి మూడు సార్లు తిలతర్పణం చేయాలి.
మాఘ పూర్ణిమ (ఫిబ్రవరి 12 ) : ప్రతి నెల పౌర్ణమి తిథి వస్తుంది. కాని మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పుణ్య నదులలో స్నానం చేస్తారు. ఈ పర్వదినాన దేవతలు భూమిపైకి ప్రవహించే నీటిలో స్నానం చేస్తారని చాలా మంది నమ్ముతారు. కుంభ మేళాలో ఐదో రాజస్నాన వేడుకలను జరుపుకుంటారు.ఈ రోజు చేసే దానధర్మాలు రెట్టింపు ఫలితాలన్నిస్తాయి .
విజయ ఏకాదశి( ఫిబ్రవరి 24).. మాఘమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వ ఏకాదశి లేదా విజయ ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి తులసి దళాలతో లక్ష్మీ నారాయణులను పూజిస్తే సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ: అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ పర్యాయములు అనుష్ఠానం చేయాలి. ఈరోజున మీశక్తి మేరకు దాన.. ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడని పురాణాల్లో రుషులు వివరించారు.
మహా శివరాత్రి ( ఫిబ్రవరి 26) : ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే చతుర్దశి మాసశివరాత్రి అంటారు. ఈ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. మాఘమాసంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు చతుర్దశి ఏ రోజున ఉంటుందో దానినే మహాశిరాత్రి అంటారు. ఇది శివునికి ప్రీతికరమైన తిథి.
మహాశివరాత్రి రోజున ఉదయమే సంకల్ప సహితంగా స్నానంచేసి, శుచిగా శివాలయానికి వెళ్ళి గాని, ఇంట్లో లింగం పెట్టికాని, లేదా దేవతార్చన ఉన్నవారు సాలగ్రామాలకు గానీ అభిషేకాలు, పూజలు (బిల్వదళాలతో) చేస్తారు. కొందరు సహస్రలింగార్చన- మహాలింగార్చన చేస్తారు. పగలంతా ఉపవాసం చేసి, రాత్రి శివపురాణాలు కథలూ చదువుతూ జాగరణం చేస్తారు. కొందరు పాలు, పెరుగు, తేనె, ఆవునెయ్యి పంచదార, చెరకురసం, గంధోదకం, పుష్పోదకాలు మొదలైన ద్రవ్యాలతో అర్ధరాత్రి లింగోద్భవ కాలానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ జాగరణం చేస్తారు. ఈసారి మహా శివరాత్రి రోజున మహాకుంభమేళాలో రాజస్నానాలు ఆచరిస్తారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజుతో మహాకుంభమేళా వేడుకలు ముగుస్తాయి. ఈరోజున శివ భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పర్వదినాన ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండటంతో పాటు కచ్చితంగా జాగరణ నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల తమకు ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
ALSO READ | ఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..
బహుళ అమావాస్య( ఫిబ్రవరి 28) : హిందూ పంచాంగం ప్రకారం, అమావాస్య తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శివుడిని పూజించడం వల్ల, తమ జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని చాలా మంది నమ్ముతారు. ఈరోజున పవిత్రమైన నదుల్లో చేసే స్నానాలకు, దేవాలయాల్లో పూజలకు, దానాలకు, ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వివాహిత స్త్రీలు తమ భర్త, పిల్లల క్షేమం కోసం ఉపవాసం ఉంటారు.