ఫ్యూడల్​ పేర్లు, వాసనలు..ఇంకెన్నాళ్లు? : జిల్లా జడ్జి ( రిటైర్డ్) మంగారి రాజేందర్

ఫ్యూడల్​ పేర్లు, వాసనలు..ఇంకెన్నాళ్లు? : జిల్లా జడ్జి ( రిటైర్డ్) మంగారి రాజేందర్

‘ప్రజాదర్బార్’ అన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజావాణి’గా మార్చివేసింది. వారంలో రెండు రోజులు ప్రజావాణిని నిర్వహించి ప్రజల దగ్గర నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరిస్తారు. ఫ్యూడల్​ లక్షణాలు ఉన్న పదాలను, పద బంధాలను మార్చడం అభిలషణీయం. అది అవసరం కూడా. వివిధ పేర్లను కాలానుగుణంగా మార్చి నేడు ఉన్న పరిస్థితులకు, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మార్చడం పాలకులు చేయాల్సిన పని. దేశ రాజధానిలోని పేర్లను కూడా ఆ మధ్య మార్చినారు. రాజ్​పథ్​ అన్న మార్గాన్ని కర్తవ్యపథ్​గా మార్చారు. వలసవాద చిహ్నాలని, పదాలను కాలానుగుణంగా మార్చడం ఆమోదయోగ్యమే అయితే ఈ మార్చే క్రమంలో సంస్కృతాన్ని, హిందీ భాషలోని పదాలని, పద బంధాలను ప్రజల మీద రుద్దకూడదు. అవి పలకడానికి అనుకూలంగా ఉండవు. పైగా పలికేందుకూ కష్టంగా ఉంటాయి.

హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తులను సంబోధించే విధానంలో పూర్తిగా ఫ్యూడల్​సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. న్యాయవాదులు అందరూ మాటమాటకీ మధ్య ‘మైలార్డ్’ అని సంబోధిస్తూ ఉంటారు. ఈవిధంగా సంబోధించాలన్న నియమం లేదు. అయినా ఈ పద్ధతికి న్యాయమూర్తులు అలవాటుపడిపోయారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే.. రైతుపని రైతు చేస్తున్నాడు. చెప్పులు కుట్టేవ్యక్తి  చెప్పులు కుడుతున్నాడు. తీర్పులు చెప్పేపని న్యాయమూర్తి చేస్తున్నాడు. పనిచేసే ఏ వ్యక్తి అయినా దైవ స్వరూపుడు. కానీ, ఎవరినీ మనం భగవంతుడుగా కీర్తించం.  హైకోర్టు,  సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే ఆ విధంగా సంబోధిస్తాం. ఇది ఎందుకో అర్థం కాదు. ‘మైలార్డ్’ అని సంబోధించకూడదని ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్​ మురళీధర్​ కోరారు. అదేవిధంగా మరికొంత మంది న్యాయమూర్తులు కూడా కోరినారు. కానీ, పెద్దగా ఫలితం లేకపోయింది.  ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ నరసింహ తనను ‘మైలార్డ్’ అని సంబోధించడం గురించి అసంతృప్తిని వెలిబుచ్చారు. ఒక న్యాయవాది వరుసగా ‘మైలార్డ్’ అని ‘లార్డ్ షిప్’ అని అనడం చూసి ఆయన ఇలా అన్నారు. ‘మైలార్డ్’ అని ఎన్నిసార్లు సంబోధిస్తారు. మీరు అలా చెప్పడం మానివేస్తే నా జీవితంలో సగభాగం మీకు ఇస్తాను’ అన్నారు. న్యాయవాదులు తమ వాదనని చెప్పేటప్పుడు తరుచుగా మైలార్డ్​ అని, లార్డ్​షిప్​ అని సంబోధిస్తారు. ఈ పద్ధతిని వ్యతిరేకించే వ్యక్తులు దాన్ని బానిస మనస్తత్వమని, వలసవాద అవశేషమని అంటారు.

‘మైలార్డ్’ బదులుగా సర్​

‘మైలార్డ్’ అనే బదులుగా సర్ అని సంబోధించవచ్చు కదా అని న్యాయమూర్తి నరసింహ ఓ న్యాయవాదిని కోరినాడు. ఆయన అసహనం ఎంతమేరకు సత్ఫలితాన్ని ఇచ్చిందో తెలియదు. కనీసం ఆయన కోర్టులో అయినా ఆ విధంగా సంబోధించడం మానివేశారో  లేదో తెలియదు. 2006వ సంవత్సరంలో ‘మైలార్డ్’,  ’యువర్​ లార్డ్ షిప్’ను అనడం మానివేయాలని బార్​కౌన్సిల్​ నిర్ణయించింది. కానీ, ఫలితం లేకుండా పోయింది. బానిస మనస్తత్వం చాలామంది న్యాయవాదుల్లో పేరుకొనిపోయింది. ఆ విధంగా అనకపోతే మంచి ఉత్తర్వులు కోర్టు నుంచి రావని అంటున్న న్యాయవాదులు కూడా ఉన్నారు. అందులోని సత్యాసత్యాలు జోలికి నేను పోదల్చుకోలేదు. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే మన హైదరాబాద్​ నగరంలో మూడు పోలీస్​ కమిషనరేట్​లు ఉన్నాయి. అవి హైదరాబాద్​ కమిషనరేట్, సైబరాబాద్​ కమిషనరేట్,  మూడవది రాచకొండ కమిషనరేట్.  మొదటి రెండు కమిషనరేట్​లు మామూలుగా ఉన్నాయి.  నేటి ప్రజల భావనలకు అనుకూలంగా ఉన్నాయి. అయితే, మూడవ కమిషనరేట్​ ప్రజల భావనలకు అనుకూలంగా లేదు. అందులో ఫ్యూడల్​ వాసనలు ఉన్నాయి. అది ఒకరకంగా బానిస మనస్తత్వానికి చిహ్నం మాదిరిగా ఉంది. దాన్ని 2016లో ఏర్పాటు చేశారు. రాచకొండ పేరు వింటేనే ఫ్యూడల్ భావనలు కనిపిస్తున్నాయి. ఈ పేరును మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. ఫ్యూడల్​ వాసనలు, పదాలు, పదబంధాలు ఈ ఆదునిక కాలంలో ఉండటానికి వీల్లేదు. ప్రతి పేరు, ప్రతి పదబంధం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించాలి. అన్ని వ్యవస్థల్లో ఈ మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఆధునిక కాలంలో ఆధునిక పేర్లు ఉండాలి. ప్రజలు పలికేవిధంగా ఉండాలి. ఫ్యూడల్​ పేర్లు, ఫ్యూడల్​ వాసనలు ఇంకా ఎన్నాళ్లు?.

చట్టాల పేర్లలో ఫ్యూడల్​ వాసనలు

భారత ప్రభుత్వం ఇటీవల మూడు ప్రధాన చట్టాలను మార్చింది. కొన్ని నిబంధనలను కొత్తగా చేర్చడం మినహా పెద్ద మార్పులను కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఇండియన్​ ఎవిడెన్స్ యాక్ట్​ను భారతీయ సాక్ష్య అధినియంగా, క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ని భారతీయ నాగరిక సురక్ష సంహితగా, ఇండియన్​ పీనల్​ కోడ్​ను భారతీయ న్యాయ సంహితగా ప్రభుత్వం మార్చివేసింది. ఈ మూడు చట్టాలు శాసన రూపం దాల్చినాయి. కానీ, వీటి అమలు తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వం ప్రకటించిన తరువాతనే అవి అమలులోకి వస్తాయి. ఈ పేర్లు ప్రజలు పలకడానికి వీలుగా లేవు. వీటి గురించి చాలామంది అభ్యంతరాలు లేవనెత్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవి కొత్త సీసాలో పాత సారాలాంటివి. ఈ పేర్లు ఒకరకంగా ప్రజాస్వామ్యబద్ధంగా లేవు. వీటిలో కూడా ఫ్యూడల్ వాసనలు ఉన్నాయి.  ఈ మూడు చట్టాల పేర్లు ఈ విధంగా ఉంటే, కోర్టుల్లో వాతావరణం మరోవిధంగా ఉంటుంది. అది విభిన్నంగా ఉంటుంది.

- మంగారి రాజేందర్,
జిల్లా జడ్జి ( రిటైర్డ్)