- భద్రాచలం ఏజెన్సీపై ఫీవర్ పంజా.. ఈ సీజన్‌లో 15 మంది జ్వరాలతో మృతి
- బుధవారం ఒక్కరోజే ముగ్గురు మృత్యువాత
- ప్రతి గ్రామంలో పెద్ద సంఖ్యలో వైరల్ బాధితులు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏజన్సీని విష జ్వరాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 మంది జ్వరాలతో చనిపోవడంతో మన్యం వణికిపోతోంది. బుధవారం ఒక్కరోజే ముగ్గురు మృత్యువాత పడ్డారు. జ్వరం రాగానే ఒక్కసారిగా ప్లేట్ లెట్స్ పడిపోయి చనిపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఊళ్లన్నీ మురికికూపాలుగా మారాయి. దోమల బెడద పెరగడంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. బూర్గంపాడు, చండ్రగొండ, పాల్వంచ, అశ్వాపురం, పినపాక, గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, చర్ల తదితర మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది.
మామూలు జ్వరమే అనుకుని..
భద్రచలం ఏజెన్సీలో వైరల్ ఫీవర్‌తో ప్రతి గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మంచాన పడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2,34,528 మందికి విషజ్వరాల బారినపడ్డారు. 9,828 మందికి డెంగీ టెస్టులు చేయగా 232 మందికి పాజిటివ్ వచ్చింది. 146 మందికి మలేరియా సోకినట్లుగా హెల్త్ డిపార్ట్‌మెంట్ చెప్తోంది. చాలామంది మామూలు జ్వరమే అనుకుని స్థానికంగా ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు.
ఆర్ఎంపీలు జ్వరాల తీవ్రత అర్థంకాక ఇస్తున్న మందులతో ఫీవర్ తగ్గడంలేదు. రెండు మూడు రోజుల్లో జ్వరం తీవ్రమై ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. పరిస్థితి విషమించి భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అప్పటికే ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయి. టెస్ట్ చేస్తే డెంగీ నెగటివ్ వస్తున్నా.. ప్లేట్ లెట్స్ పడిపోయి మిగిలిన అవయవాలు దెబ్బతినడంతో చనిపోతున్నారు.
భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన పద్మ అనే యువతి చనిపోయింది. జ్వరం రావడంతో చికిత్స పొందుతున్న ఆమె.. ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరడంతో భద్రాచలం తీసుకొచ్చారు. అప్పటికే కోమాలోకి వెళ్లిన ఆమె ప్లేట్లెట్స్ పడిపోయి కన్నుమూసింది. కరకగూడెంకు చెందిన 16 ఏళ్ల స్పందనను ప్లేట్లెట్స్ పడిపోవడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ చేస్తుండగానే చనిపోయింది.
ఆర్ఎంపీలు హైపవర్ యాంటిబయాటిక్స్ ఇస్తున్నరు
జ్వరం రాగానే స్థానిక ఆర్ఎంపీల వద్దకు పోతే వాళ్లు హైపవర్ యాంటిబయాటిక్స్ ఇస్తున్నారు. దీనివల్ల ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. డెంగీ టెస్ట్ చేస్తే నెగటివ్ వస్తున్నది. వైరల్ ఫీవర్లకు పారాసిటమల్ టాబ్లెట్లు వాడితే సరిపోతుంది. చనిపోయిన వారెవరిలోనూ డెంగీ లక్షణాలు కనిపించలేదు. ప్లేట్లెట్స్ మాత్రం డౌన్ అవుతున్నాయి. ఊళ్లలో పారిశుధ్యం లేకపోవడం వైరల్ ఫీవర్ కేసులు పెరగడానికి కారణం.
- గొంది వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్