ఇంకా ముంపులోనే హైదరాబాద్ లోని పలు కాలనీలు
కొన్ని అడుగుల మేర నిలిచిపోయిన నీళ్లు, బురద
హైదరాబాద్, వెలుగు: కుండపోత వానలతో అతలాకుతలమైన హైదరాబాద్ లోని పలు కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పదుల సంఖ్యలో కాలనీల్లో ఇంకా రెండు, మూడు అడుగుల మేర నీళ్లు నిలిచిఉండగా.. వందల సంఖ్యలో కాలనీలు, అక్కడి ఇండ్లు బురదతో నిండిపోయి ఉన్నాయి. దాదాపు రెండు వారాలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. తమకు సర్కారు సాయం అందడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. కాలనీల్లోని రోడ్లపైనే కాదు.. ఇండ్లలోనూ ఒకటి రెండు ఫీట్ల మేర బురద పేరుకుని ఉండటంతో క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు. లక్షల విలువ చేసే సామాన్లు కొట్టుకుపోయాయని, తినడానికి తిండి కూడా లేదని కన్నీళ్లు పెడ్తున్నారు.
ఎటుచూసినా నీళ్లు.. బురదే..
భారీ వర్షానికి వరద ముంచెత్తడంతో చాలా కాలనీల్లో జనం కట్టుబట్టలతో బయటికి వచ్చారు. షేక్ పేట, టోలిచౌకి, చాదర్ ఘాట్, ఫలక్ నుమా వంటి ఏరియాల్లోని కాలనీల్లో ముంపు తగ్గినా బురద పేరుకుపోయింది. మీర్ పేట, సరూర్ నగర్ వంటి ప్రాంతాల్లో కొన్ని కాలనీలు ముంపులోనే ఉన్నాయి.
సహాయక చర్యలేవీ?
వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న సర్కారు ఏవో కొన్ని కాలనీలనే పట్టించుకుంటోందని.. చాలా కాలనీల పరిస్థితి దారుణంగా ఉందని బాధితులు వాపోతున్నారు. వానలు ఆగిపోయి వారం అవుతున్నా బురద తొలగించడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులు రాలేదని మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ వాళ్లను అడిగితే పండుగ సెలవులని అంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బురదను జేసీబీలు, ట్రాక్టర్ల ద్వారా తొలగిస్తున్నామని.. ఇండ్లలో బురద క్లియర్ చేసుకోవడానికి స్వచ్చంద సంస్థల వాళ్లు, ప్రతిపక్షాల కార్యకర్తలు సాయపడుతున్నారని చెప్తున్నారు. స్వచ్చంద సంస్థల వాళ్లు, స్థానికులు ఇస్తున్న ఫుడ్ తింటున్నామని అంటున్నారు.
ఇంకా నీళ్లు పోలే..
రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ లోని బుర్హాన్ ఖాన్ చెరువు సమీపంలో ఉన్న కాలనీలు 20 రోజులుగా నీటిలోనే ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీట మునిగిన ఇక్కడి కాలనీల్లో సోమవారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ ఉజ్మా షాకిర్ లు పర్యటించి.. బాధితులను పరామర్శించారు.
ఒక్క సామాను కూడా మిగల్లేదు
మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో 40 మందికిపైగా ఉంటం. ఇంట్లో పెండ్లి ఉంటే కొత్త సామాను కొనుక్కొచ్చి పెట్టినం. వానపడి ఇంట్లకు నీళ్లు వచ్చినయి. అందరం పై అంతస్తుకు పొయినం. రాత్రంతా పైననే ఉండి.. తెల్లారి బోట్ల మీద బయటపడ్డం. ఇప్పుడు నీళ్లు తగ్గినయని వస్తే.. అడుగు లోతు బురద పేరుకుని ఉంది. కొత్త ఫ్రిడ్జ్, బెడ్లు, వాషింగ్ మెషీన్, టీవీ, కారు, బైక్ అన్నీ పాడైపొయినయి. లక్షల రూపాయలు నష్టపొయినం. – సయ్యద్ జావీద్, నదీం కాలనీ, టోలీచౌకి
ఎవరూ పట్టించుకుంట లేరు
మా కాలనీని 14 ఫీట్ల వాటర్ ముంచెత్తింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా సగం దాకా మునిగిపోయింది. ఎంతో మంది చనిపోయారు. మాకు సర్కారు ఎట్లాంటి పునరావాసం కల్పించ లేదు. చుట్టాల ఇంటికి పోయి ప్రాణాలు కాపాడుకున్నం. నీళ్లు పోయినయని వస్తే.. కాలనీ, ఇండ్లు అంతటా ఎక్కడ చూసినా బురద పేరుకుపోయి ఉంది. ఎమ్మెల్యే గానీ, లీడర్లు గానీ ఎవరూ మావైపు చూడలేదు. వందల కుటుంబాలు వరద నీళ్లకు ఆగమైపోయాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పొద్దంతా బురద, చెత్త క్లీన్ చేసుకుంటున్నాం.. రాత్రి కాగానే చుట్టాల ఇంటికి పోతున్నం. మాకు ఇక్కడి మసీదు వాళ్లే అన్నం, నీళ్లు పంపిణీ చేస్తున్నరు.– అఫ్జల్ ఖాన్, అల్ జుబైల్ కాలనీ, ఫలక్ నుమా
చాలా నష్టపోయాం
మా ఇంట్లో నలుగురం ఉంటాం. మా అమ్మ కి 65ఏళ్లుంటాయి. వర్షం పడి వరదనీరు ఇంట్లో సగానికి పైగా వచ్చింది. బోట్లతో ఆ రాత్రి బయటపడ్డాం. ఇన్ని రోజులు బంధువుల ఇంట్లోనే ఉన్నాం. నీళ్లంతా పోయాక వచ్చి చూస్తే దుఃఖం ఆగలేదు. లాక్ డౌన్ వల్ల పనులు లేక ఆర్థికంగా దెబ్బతిన్న మాకు ఇప్పుడు ఇంట్లో సామానంతా పోయింది. టేబుల్స్, బీరువాలు, బెడ్ లు, బట్టలు అన్ని పాడైపోయాయి. మేమే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం. బయట, ఇంట్లో పరిస్థితి ఒకేలా ఉంది. మా బతుకులు ఎప్పటికి బాగుపడుతాయో తెలియట్లేదు.– మహ్మద్ ఫయాజ్ ఖాన్, నదీం కాలనీ