హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకాన్ని 5 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్న భూములకు మాత్రమే ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు పద్మనాభరెడ్డి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి లెటర్ రాశారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలు 50% లోపే ఉన్నాయని, బడ్జెట్ సింహభాగం రైతు సంక్షేమానికి ఖర్చు పెడితే మరి మిగిలిన వారి సంగతేంటని ప్రశ్నించారు.
రిజర్వ్ బ్యాంకు తమ నివేదికలో ఎక్కువ ప్రజాధనం సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేయడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని పేర్కొన్నదని గుర్తుచేశారు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. అన్నంపెట్టే అన్నదాతలను ఆదుకునే అవసరం ఎంతో ఉందని, అయితే బడా భూస్వాములు, ఆదాయపు పన్ను కట్టే శ్రీమంతులను ఈ పథకం నుంచి దూరంగా ఉంచాలని చెపపారు. అలాగే కౌలు రైతులకు న్యాయం చేయాలని పద్మనాభరెడ్డి తన లెటర్ ద్వారా సీఎంను రిక్వెస్ట్ చేశారు.