హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భద్రతా కమిషన్, పోలీస్ కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని సీఎంను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకురావాలని ఇప్పటి వరకు ఎన్నో కమిటీలు సిఫారసులు చేశాయని చివరకు 2006లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ పలు గైడ్ లైన్స్ ఇచ్చిందని ఆయన అన్నారు. మంగళవారం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. పోలీస్ శాఖ పనితీరును భద్రతా కమిషన్ పర్యవేక్షిస్తుందని వారికి సలహాలు, సూచనలు ఇస్తుందని తెలిపారు.
కంప్లయింట్ అథారిటీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఐపీఎస్ లపై వచ్చిన ఆరోపణలను విచారిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను అధికారంలో ఉన్న నేతలు తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని ఇందుకు ఫోన్ ట్యాపింగ్, ప్రతిపక్ష నేతలపై కేసులు ప్రత్యక్ష ఉదాహరణలని పద్మానాభరెడ్డి చెప్పారు. నేరస్తులు, భూకబ్జాదారులతో పోలీసులు కుమ్మక్కై బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలతో 2001లో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో పోలీస్ కంప్లయింట్ అథారిటీలు ఏర్పాటు చేసినప్పటికీ అవి పని చేయలేదని పద్మనాభరెడ్డి గుర్తు చేశారు.