
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు రేవంత్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, రవాణా, నిల్వ, వాడకంపై కర్నాటక రాష్ట్రం నిషేధం విధించిందని, తెలంగాణలో కూడా అలాగే నిషేధం విధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని 2021లో రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిందని, దీనికి అనుగుణంగా 2022 జులై 1న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ఈ జీవో ప్రకారం ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడినా, 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన చేతి సంచులు వాడినా రూ. 500 జరిమానా అని జీవోలో పేర్కొన్నారని పద్మనాభరెడ్డి వివరించారు. జీవో 40 అమలుపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సీఎంను లేఖలో కోరారు.