రైతు భరోసా: సాగు లేని భూములను ఇలా గుర్తిస్తారు..గ్రామాల్లోకి ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్

పోడు భూములకూ (ఆర్ వోఎఫ్​ఆర్​ పట్టాలు) రైతు భరోసా ఇవ్వాలని  సర్కారు నిర్ణయించింది. పంట వేసినా.. వేయకున్నా.. సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా పేరుతో రైతాంగానికి పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఈ పథకం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ తాజాగా ఉత్తర్వులు (తెలుగులోనూ) జారీ చేశారు.  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆహార భద్రత కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జనవరి 26 నుంచి సర్కారు అమలు చేయనున్నది.

సాగు యోగ్యత లేని భూముల గుర్తింపునకు ఫీల్డ్​ వెరిఫికేషన్​ టీమ్స్​

సాగు యోగ్యత లేని భూములను గుర్తించేందుకు ఫీల్డ్​ వెరిఫికేషన్​ టీమ్​లను రంగంలోకి దించుతున్నారు. పంచాయతీరాజ్​, మండల రెవెన్యూ, అగ్రికల్చర్​ అధికారుల సారథ్యంలో సాగు యోగ్యంలో లేని భూముల గుర్తింపు ప్రక్రియను చేపట్టనున్నారు. పంచాయతీ సెక్రటరీ, ఏవోలు, ఆర్ఐ లు ఫీల్డ్​ వెరిఫికేషన్​  టీమ్​ లీడర్స్​గా ఉంటారు. ఫీల్డ్​ వెరిఫికేషన్​ టీమ్​లో  రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్, జీపీఎస్, ఫీల్డ్​ అసిస్టెంట్​, ఆర్ఏ, ఏఈవోలు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్​ సారథ్యంలోని డీఏవోలు,  ఎంపీడీవోలు  తదితర ఉన్నతాధికారులు ఈ టీమ్​లను పర్యవేక్షిస్తారు.

 ఇలా గుర్తిస్తారు.. 

ఫీల్డ్​ వెరిఫికేషన్​ టీమ్​లు విలేజ్​లో ఎక్కడెక్కడ నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్​లు ఉన్నాయో గుర్తిస్తాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారి, రెవెన్యూ ఇన్​స్పెక్టర్లు బృందంగా  సర్వే చేస్తారు. ఆయా గ్రామాల్లోని ఆర్వోఆర్, పట్టాదారు పాస్​పుస్తకాల జాబితాను పరిశీలిస్తారు. భూ భారతి పోర్టల్ నుంచి జాబితా, విలేజ్​ మ్యాప్, గూగుల్ మ్యాప్​ల  ఆధారంగా పర్యవేక్షించి, వ్యవసాయ యోగ్యంకాని భూముల జాబితాను రూపొందిస్తారు. దాని ఆధారంగా తహసీల్దారు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా జాబితాలోని సర్వే నంబర్లలో ఉన్న భూములను పరిశీలించి, వ్యవసాయ యోగ్యం కాని వాటిని గుర్తిస్తారు. 

ఆ భూముల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించి, చదివి వినిపించి, చర్చించిన అనంతరం ఆమోదం తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలిస్తారు. అనంతరం గ్రామాలవారీగా వ్యవసాయ యోగ్యంకాని భూముల పట్టికను పోర్టల్​లో సంబంధిత అధికారి నమోదు చేసి, డిజిటల్ సంతకం చేస్తారు. ఈ నెల 16 నుంచి 19 వరకు ఫీల్డ్​ వెరిఫికేషన్​ ప్రక్రియ చేపట్టనున్నారు. 25న ఈ జాబితాలను జిల్లాలవారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించి.. మిగిలిన భూముల జాబితా ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జనవరి 26న విడుదల చేస్తుంది.