బాంబుల మోత..రాకెట్ల వర్షం : ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య భీకర దాడులు

బాంబుల మోత..రాకెట్ల వర్షం : ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య భీకర దాడులు

ఇజ్రాయెల్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఆదివారం పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. హెజ్బొల్లా స్థావరాలపై వంద ఫైటర్ జెట్​లతో ఇజ్రాయెల్ బాంబులు వేయగా.. మిలిటెంట్లు వందలాది రాకెట్లను ప్రయోగించారు. 

  • 6 వేల రాకెట్లతో దాడికిసిద్ధమైన మిలిటెంట్ గ్రూప్
  • ముందే 100 ఫైటర్ జెట్​లతో విరుచుకుపడ్డ ఐడీఎఫ్
  • 320 రాకెట్లు ప్రయోగించిన హెజ్బొల్లా.. వందలాది బాంబులు వేసిన ఇజ్రాయెల్

జెరూసలెం: పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్ ఆర్మీ, లెబనాన్​లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఆదివారం పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. హెజ్బొల్లా స్థావరాలపై వంద ఫైటర్ జెట్​లతో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించగా.. అటువైపు నుంచి మిలిటెంట్లు వందలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల లెబనాన్ రాజధాని బీరుట్​లో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫాద్ షుక్రూను, ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, హెజ్బొల్లా ప్రకటించాయి. ఆదివారం హెజ్బొల్లా మిలిటెంట్లు దాదాపు 6 వేల కత్యూష రాకెట్లతో ఇజ్రాయెల్​పై దాడికి సిద్ధమయ్యారు. దీంతో దాడి జరిగే ప్రమాదాన్ని ముందే గుర్తించిన ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం తెల్లవారుజామునే 100 ఫైటర్ జెట్​లను రంగంలోకి దింపింది. లెబనాన్​లోని హెజ్బొల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. హెజ్బొల్లాకు చెందిన వేలాది రాకెట్ లాంచర్ బ్యారెల్స్​ను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది. హెజ్బొల్లా స్పందిస్తూ.. ఇజ్రాయెల్​లోని 11 మిలిటరీ సైట్​లు, ఐరన్ డోమ్ వేదికలపైకి 320 కత్యూష రాకెట్లను, డ్రోన్​లను ప్రయోగించామని, తొలి విడత దాడులు ముగిశాయని ప్రకటన చేసింది. 
అయితే, ఒకపక్క గాజాలో కాల్పుల విరమణపై ఈజిప్టులో చర్చలు జరుగుతున్న సమయంలోనే మరోపక్క రాకెట్ల వర్షం, బాంబుల మోత చోటుచేసుకోవడంతో కాల్పుల విరమణ అంశం ప్రశ్నార్థకం అయింది.

Also Read:-రెండు నెలలు.. 166 కూల్చివేతలు

మాకు హాని చేస్తే.. మేమూ హాని చేస్తాం: నెతన్యాహు 

హెజ్బొల్లా తమ దేశం వైపు ఎక్కుపెట్టిన వేలాది రాకెట్లను ధ్వంసం చేశామని ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘మాకు ఎవరైనా హాని తలపెడితే మేం కూడా వారికి హాని చేస్తాం” అన్న సాధారణ నియమానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉందన్నారు. తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకునేందుకు ఏం చేసేందుకైనా వెనకాడబోమని హెచ్చరించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్​లో 48 గంటల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి గాలంట్ ప్రకటించారు. కాగా, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య తాజా పరిణామాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గమనిస్తున్నారని వైట్​హౌస్ వెల్లడించింది. ఇజ్రాయెల్​కు తనను తాను కాపాడుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది.