- హెజ్బొల్లా ‘రాకెట్’ కమాండర్ హతం
- లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు
- మిలిటెంట్ కమాండర్ సహా ఆరుగురు మృతి
- రెండ్రోజుల్లో 558కి చేరిన మృతుల సంఖ్య
- ఇజ్రాయెల్ పైకి 200 రాకెట్లు ప్రయోగించిన హెజ్బొల్లా
జెరూసలెం/బీరుట్: ఇజ్రాయెల్ ఆర్మీ, లెబనాన్ లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన రాకెట్, మిసైల్ దాడుల్లో మృతుల సంఖ్య 558కి చేరిందని మంగళవారం లెబనాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మంగళవారం బీరుట్ లోని ఓ స్థావరంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబుదాడిలో హెజ్బొల్లా రాకెట్ డివిజన్ కమాండర్ ఇబ్రహీం కుబైసీ సహా ఆరుగురు మిలిటెంట్లు మృతిచెందినట్టు తెలిపాయి.
రెండ్రోజుల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం 558 మంది చనిపోయారని, వీరిలో 50 మంది పిల్లలు, 94 మంది మహిళలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఉత్తర ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా గ్రూపు మంగళవారం దాదాపు 200 రాకెట్లను ప్రయోగించింది. హైఫా, అఫూలా, నజరెత్ తదితర నగరాలపైకి ఆ రాకెట్లు దూసుకుపోయాయి.
ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలు, ఎయిర్ ఫీల్డ్ లను లక్ష్యంగా చేసుకుని ఆ రాకెట్లను ప్రయోగించామని హెజ్బొల్లా పేర్కొంది. అయితే, ఆ రాకెట్లను తమ ఐరన్ డోమ్ తో గాలిలోనే పేల్చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అధికారులు తెలిపారు. ఇక, ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య యుద్ధం కారణంగా దక్షిణ లెబనాన్ లోని నగరాలు, గ్రామాల నుంచి వేల సంఖ్యలో పౌరులు ప్రాణ రక్షణ కోసం రాజధాని బీరుట్ వైపు పారిపోయారు.
దక్షిణ లెబనాన్ లో హెజ్బొల్లాకు చెందిన1,600 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకూ 1645 మంది గాయపడ్డారని లెబనాన్ వైద్య శాఖ అధికారులు తెలిపారు. లెబనాన్ లో1975, 1990లలో జరిగిన అంతర్యుద్ధం తర్వాత ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని వారు వెల్లడించారు. అలాగే 2006 తర్వాత ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ప్రారంభమైన యుద్ధంలో ఈ స్థాయిలో ప్రజలు చనిపోవడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పారు.
మరోవైపు, లెబనాన్ లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు స్థావరాలను ధ్వంసం చేసేందుకు రాబోయే రోజుల్లో తమ యుద్ధ వ్యూహాన్ని మార్చుకోబోతున్నామని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెజ్రీ హలేవీ తెలిపారు.
జర్నలిస్ట్ ఇంటి సమీపంలో పేలిన మిసైల్
ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాక్ కు చెందిన ఐన్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తుండగా లెబనాన్ కు చెందిన మరాయా నెట్ వర్క్ ఎడిటర్ ఫాదీ బౌడియాకు భారీ షాక్ తగిలింది. సోమవారం అల్ బెకా సిటీలోని తన ఇంటి నుంచి ఆయన లైవ్ లో మాట్లాడుతుండగా.. ఇంటి సమీపంలోనే ఇజ్రాయెల్ మిసైల్ పడింది. మిసైల్ పేలుడుకు ఫాదీ ఇంటి కిటికీ బద్దలైపోయింది. పేలుడు శబ్దం ధాటికి బౌడియా ప్రాణభయంతో అరుస్తూ లేచి పక్కకు వెళ్లడం, ఇంటి కిటికీ బద్దలైపోవడం వీడియోలో కనిపించింది.
లెబనాన్ విడిచివెళ్లండి: ఆ దేశ ప్రజలకు నెతన్యాహు హెచ్చరిక
హెజ్బొల్లా టెర్రరిస్ట్ గ్రూపుతో తాము యుద్ధం చేస్తున్నందున వెంటనే లెబనాన్ విడిచి వెళ్లిపోవాలని ఆ దేశ పౌరులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. తన హెచ్చరికను సీరియస్ గా తీసుకోవాలని ఆయన సూచించారు. హెజ్బొల్లాతో యుద్ధం ముగిసిన తర్వాతే తిరిగి సొంత దేశానికి తిగిరి వెళ్లాలన్నారు. ‘‘ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నది మీ (లెబనాన్) మీద కాదు. హెజ్బొల్లా మీదే మా యుద్ధం.
చాలాకాలంగా హెజ్బొల్లా టెర్రరిస్టులు మిమ్మల్ని (లెబనాన్ ప్రజలు) మానవ కవచంగా వాడుకుంటున్నారు. వారు మీ ఇండ్లు, గ్యారేజీల్లో రాకెట్లు, మిసైల్స్ దాచి పెడుతున్నారు. వాటిని మాపైకి ప్రయోగిస్తున్నారు. హెజ్బొల్లా టెర్రరిస్టులను అంతం చేసేందుకు మేము యుద్ధం చేస్తున్నాం. అందుకే వెంటనే లెబనాన్ విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపొండి” అని నెతన్యాహు ఓ వీడియో మెసేజ్ లో పేర్కొన్నారు.