ఖమ్మంలో రెబల్స్ గుబులు

  • కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పొంచి ఉన్న ముప్పు
  • బీఫామ్ వస్తుందని ఆశించి భంగపడ్డ లీడర్లు
  • రాయల నాగేశ్వరరావు నామినేషన్​ రిజెక్ట్ 
  • ఇండిపెండెంట్ గా బరిలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల 
  • ఉపసంహరింపజేసేందుకు ముఖ్య నేతల కసరత్తు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులను రెబల్స్​ టెన్షన్​ పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీల మధ్య ఈ ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉంది. బీఆర్​ఎస్​కు ఖమ్మం సిట్టింగ్ సీటు కాగా, ఈ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ స్థానాలను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ కూటమి గెల్చుకుంది. దీంతో రెండు పార్టీల అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించాలనే కసితో ఉన్నారు. కానీ ఈ రెండు పార్టీల క్యాండిడేట్లకు రెబల్స్ బెడద తప్పేట్లు కనిపించడం లేదు. ప్రధానంగా నామినేషన్ల చివరి రోజు వరకు కాంగ్రెస్​ అభ్యర్థిపై క్లారిటీ లేకపోవడంతో, మిగిలిన ఆశావహులు కూడా కొందరు నామినేషన్లు వేశారు. 

బీఫామ్​ తెచ్చుకుంటామన్న ధీమాతో కాంగ్రెస్​ అభ్యర్థిగానే నామినేషన్లు వేయగా, స్క్రూటినీ సందర్భంగా వాటిని అధికారులు రిజెక్ట్ చేశారు. బీఫామ్​ సబ్​ మిట్ చేయకపోవడంతో కాంగ్రెస్​ లీడర్లు రాయల నాగేశ్వరరావు, ఉల్లెంగుల యాదగిరి, పోట్ల నాగేశ్వరరావు, నాగసీతారాములు నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. అయితే మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఉల్లెంగుల యాదగిరి ఇండిపెండెంట్ గా వేసిన నామినేషన్లను అధికారులు యాక్సెప్ట్ చేశారు. దీంతో పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్​ రెబల్ గా బరిలో నిలిచినట్టయింది. 

అసెంబ్లీ ఎన్నికల్లోనూ ‘పోట్ల’కు భంగపాటు!

గతంలో టీడీపీ తరఫున ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచిన పోట్ల నాగేశ్వరరావు తర్వాత కాంగ్రెస్​ లో చేరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుడిగా ఉన్న ఆయన పీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ ను ఆశించినా పొత్తులో భాగంగా ఆ సీటును సీపీఐకి కేటాయించడంతో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో పార్లమెంట్ బరిలో అయినా నిలవాలని భావించి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

నామినేషన్ల చివరి రోజు వరకు కాంగ్రెస్​ టికెట్ విషయంలో హైడ్రామా కొనసాగడంతో ముందుగానే రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒకటి ఇండిపెండెంట్ గా, మరొక నామినేషన్ కాంగ్రెస్​ అభ్యర్థిగా ఫైల్ చేశారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు. మరోవైపు పోట్లకు మద్దతుగా కొత్తగూడెంలో శుక్రవారం ఆయన అనుచరులు సమావేశం నిర్వహించారు. తమ నేత పోట్ల నాగేశ్వరరావు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తీర్మానం చేశారు. ఇండిపెండెంట్ గా పోట్లను గెలిపించుకుంటామని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కను కలవాలని నిర్ణయం తీసుకున్నారు.   

బీఆర్ఎస్ లో ‘బాజీ బాబా’ టెన్షన్​ 

బీఆర్ఎస్​ తరఫున ఆ పార్టీకి చెందిన మైనార్టీ నేత షేక్ బాజీ బాబా ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు. బీఆర్ఎస్​ విద్యార్థి విభాగం నేతగా ఉన్న ఆయన, మైనార్టీలను తమ పార్టీ నిర్లక్ష్యం చేస్తుందంటూ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ సమన్వయ కమిటీల్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ నామినేషన్​ దాఖలు చేశారు. ఈనెల 29వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈలోగా రెబల్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓట్లు చీలకుండా ఉండేందుకు వారితో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం.