నామినేటెడ్ ​పోస్టులు దక్కేదెవరికో?

  •     అసెంబ్లీ పోటీ ఛాన్స్​ దక్కని లీడర్ల ఎదురుచూపులు
  •     పదేండ్ల తర్వాత గవర్నమెంట్​వచ్చినందున పదవులపై ఆశలు

నిజామాబాద్, వెలుగు : గవర్నమెంట్​ నామినేటెడ్ ​పోస్టుల కోసం జిల్లా కాంగ్రెస్ ​లీడర్ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కని లీడర్లకు నామినేటెడ్​ పదవు లిస్తామని హైకమాండ్​ చెప్పింది. దీంతో అప్పుడు టికెట్లు ఆశించి భంగపడ్డ వారంతా పార్టీ అభ్యర్థుల విజయం కోసం కష్టపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు వారి చూపు నామినేటెడ్​ పోస్టులపై పడింది.

పదేండ్లు ప్రతిపక్షంలో ఉండి కష్టాలు పడ్డందున  ఎప్పుడెప్పుడు పదవుల్లో కూర్చుందామని ఆరాటపడుతున్నారు. జిల్లాలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నందున ఎవరికి పోస్టులు దక్కుతాయనే విషయం ఆసక్తి రేపుతోంది.

అర్బన్​లో అధికం..

నిజామాబాద్​అర్బన్ ​సెగ్మెంట్​ నుంచి కాంగ్రెస్​పార్టీ అనూహ్యంగా సీనియర్​ లీడర్ షబ్బీర్​అలీని పోటీ చేయించింది. దీంతో టికెట్లు ఆశించిన మైనార్టీ నేత తాహెర్, మాజీ మేయర్​ సంజయ్, కేశవేణు, టీపీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్​ లకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు వారంతా నామినేటెడ్​పోస్టులపై దృష్టి పెట్టారు. దళిత సామాజిక వర్గం నుంచి గడుగు గంగాధర్​ కూడా పదవిపై ఆశ పెట్టుకున్నారు.

మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మహిళా కోటా కింద ఆకుల లలిత ప్రాధాన్యత ఉన్న పోస్టును ఆశిస్తున్నారు. పార్టీలో ప్రతీఒక్కరికి గాడ్​ఫాదర్లు​ఉన్నారు. వారి వైపు నుంచి రాష్ట్ర స్థాయి పోస్టులు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అవకాశం లభించని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్​రెడ్డి, రాష్ట్ర కిసాన్ ​ఖేత్​అధ్యక్షుడు అన్వేశ్​రెడ్డి కూడా కార్పొరేషన్​పదవులు ఆశిస్తున్నారు. మహిళా కోటాలో ప్రేమ్​లత అగర్వాల్​ ఉన్నారు. 

ఆర్మూర్​లో..

పార్టీ పెద్దల ఆదేశాలతో అసెంబ్లీ పోటీ నుంచి వైదొలిగిన గోర్త రాజేందర్​, జిల్లా లైబ్రరీ కమిటీ మాజీ చైర్మన్​మార చంద్రమోహన్​ కూడా పదవిపై ఆశతో ఉన్నారు. 

సీనియర్​ లీడర్ల సర్దుబాటు ఎలా..

ఎలక్షన్​ టైమ్​లో కాంగ్రెస్​లో చేరిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కు క్యాబినెట్​హోదా నామినేటెడ్​ పోస్ట్​ ఇస్తారని టాక్​ నడుస్తోంది. పార్టీ ముఖ్యలీడర్లు ఇందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రూరల్​కు చెందిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మార్కెట్​కమిటీ మాజీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, బోధన్​సెగ్మెంట్​కు చెందిన కెప్టెన్​ కరుణాకర్​రెడ్డి కూడా పదవులు ఆశిస్తున్నారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న లీడర్లను స్టేట్​తో పాటు జిల్లాలోని నామినేటెడ్​ పోస్టుల్లో అడ్జెస్ట్​ చేయనున్నారు.