దక్షిణ లెబనాన్​లో భీకర పోరు

దక్షిణ లెబనాన్​లో భీకర పోరు
  • భూతల దాడులు ముమ్మరం చేసిన ఇజ్రాయెల్
  • తీవ్రంగా ప్రతిఘటించిన హెజ్బొల్లా మిలిటెంట్లు
  • తమ సోల్జర్లు 8 మంది మరణించారన్న ఐడీఎఫ్ 
  • ఇరాన్​పై ప్రతీకార దాడుల విషయంలో ఇజ్రాయెల్ మౌనం

జెరూసలెం/బీరుట్/టెహ్రాన్: హమాస్, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు.. ఇజ్రాయెల్​పై ఇరాన్ వందలాది క్షిపణుల ప్రయోగం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. లెబనాన్​లోని హెజ్బొల్లా టెర్రరిస్టుల ఏరివేతకు చేపట్టిన భూతల దాడులను ఇజ్రాయెల్ ముమ్మరం చేసింది. బీరుట్ సహా పలు ప్రాంతాలపై వైమానిక దాడులు కొనసాగించింది. బుధవారం హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బలగాలు నేరుగా దాడులు చేయగా.. హెజ్బొల్లా మిలిటెంట్లు తీవ్రంగా ప్రతిఘటించారు. ఐడీఎఫ్ బలగాలు దక్షిణ లెబనాన్​లోకి దాదాపు 400 మీటర్లు దూసుకెళ్లి దాడులు చేశాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోరాటంలో తమ సోల్జర్లు 8 మంది చనిపోయారని ఐడీఎఫ్ ప్రకటించింది. హెజ్బొల్లాపై పోరాటం ఆపబోమని, దక్షిణ లెబనాన్​లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన బఫర్ జోన్​లోని మరో 24 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. అయితే, తాము జరిపిన దాడుల్లో ఐడీఎఫ్​కు చెందిన అనేక మంది సోల్జర్లు చనిపోయారని, చాలామంది గాయపడ్డారని హెజ్బొల్లా ప్రకటించింది. కాగా, టెల్​అవీవ్​లో మంగళవారం ఇద్దరు టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారని, 16 మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు బుధవారం వెల్లడించారు. 

ఇజ్రాయెల్​కు అమెరికా, బ్రిటన్ సహకారం..   

ఇజ్రాయెల్ పైకి ఇరాన్ మంగళవారం దాదాపు 400 మిసైల్స్ ను ప్రయోగించగా.. వాటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్​కు అమెరికా, బ్రిటన్ సహకరించాయి. అమెరికా యుద్ధనౌకల నుంచి ఇంటర్ సెప్టర్ క్షిపణులతో ఇరాన్ మిసైల్స్​లో కొన్నింటిని కూల్చేశాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టం ఫెయిల్ అయిందని, తమ మిసైల్స్​లో చాలా వరకూ టార్గెట్లను ధ్వంసం చేశాయని ఇరాన్ ప్రకటించింది. అయితే, కొన్ని మిసైల్స్ తప్ప చాలా వాటిని ఆకాశంలోనే పేల్చేశామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్ చేసిన దాడి పేలవంగా ఉందని, ఒకరకంగా ఈ దాడిలో అది ఓడిపోయిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్ రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మిడిల్ ఈస్ట్​లో ఇరాన్ ఒక ప్రమాదకర, అశాంతియుత శక్తిగా తయారైందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మండిపడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ కూడా ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించారు.

డెన్మార్క్​లోని ఇజ్రాయెల్​ ఎంబసీ వద్ద పేలుళ్లు

డెన్మార్క్​ రాజధాని కోపెన్​హెగెన్​లో ఇజ్రాయెల్​ ఎంబసీ సమీపంలో బుధవారం రెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో డెన్మార్క్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సాయుధ దళాలు, సెర్చ్​ డాగ్స్​, ఫోరెన్సిక్​​ బృందాలు అక్కడికి చేరుకొని, దర్యాప్తు ప్రారంభించాయి.

గుటెర్రస్​పై ఇజ్రాయెల్ బ్యాన్ 

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్​ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నామని బుధవారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇరాన్ దాడిని ఖండిం చకుండా, కేవలం ఇజ్రాయెల్ దాడుల ను మాత్రమే ఖండిస్తూ పక్షపాతం చూపుతున్నందుకే ఆయనపై బ్యాన్ విధిస్తున్నట్లు కజ్జ్ స్పష్టం చేశారు. 

ఇరాన్​పై ఇజ్రాయెల్ సైలెంట్​గా ప్లాన్? 

తమ దేశంపైకి ఏకంగా 400 మిసైల్స్ ప్రయోగించి ఇరాన్ అతిపెద్ద తప్పు చేసిందని, ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మంగళవారం రాత్రి హెచ్చరించిన ఇజ్రాయెల్ తదుపరి ఏం చేయబోతోందన్న దానిపై మాత్రం సైలెంట్ గా వ్యవహరిస్తోంది. అయితే, వందలాది బాలిస్టిక్ మిసైల్స్ తో ఏకంగా టెల్ అవీవ్, మిలిటరీ బేస్ లు లక్ష్యంగా ఇరాన్ చేసిన దాడికి ఇజ్రాయెల్ తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ సారి ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీగా ఐడీఎఫ్ విరుచుకుపడవచ్చని..  అలాగే ఇరాన్ ను తీవ్ర స్థాయిలో దెబ్బ తీసేలా అణు స్థావరాలను, ఆర్మీ బేస్ లను, విద్యుత్ కేంద్రాలను పేల్చేయవచ్చని అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది.

సంయమనం పాటించాలి: భారత్ 

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకోవడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధంలో సామాన్య ప్రజలే సమిధలుగా మారుతున్నారని, వారి రక్షణకు కట్టుబడి ఉండాలని తెలిపింది. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని బుధవారం ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. చర్చలు, దౌత్య మార్గంలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత విస్తరించడం ఆందోళనకరమని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. మంగళవారం వాషింగ్టన్​లో నిర్వహించిన కార్నెగీ ఎండోమెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోయిన ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని టెర్రరిస్ట్ అటాక్ గానే భావిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఇరాన్​కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత  పౌరులకు కేంద్రం సూచించింది. ఇరాన్​లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ మేరకు బుధవారం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్​లో ఉన్న ఇండియన్స్​అందరూ అవసరమైతే టెహ్రాన్​లోని ఎంబసీతో కాంటాక్ట్​లో ఉండాలని సూచించింది.

లెబనాన్ నుంచిహెజ్బొల్లా మిలిటెంట్లు  ప్రయోగించిన మిసైల్ టెల్​ అవీవ్​లోని మొసాద్ హెడ్డాఫీసు ముందు పడడం తో భారీ గుంత ఏర్పడింది.

అమెరికా, యూరప్ జోక్యంతోనే సమస్య: ఖమేనీ

మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా, యూరోపియన్ దేశాల బలగాలు వెళ్లిపోవాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ డిమాండ్ చేశారు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఐఆర్ఎన్ఏ’తో ఆయన బుధవారం మాట్లాడారు. ‘‘ఈ ప్రాంతంలోని దేశాలు వాటిని అవి మేనేజ్ చేసుకోగలవు. మేం కలిసికట్టుగా ఉండి శాంతియుతంగా జీవిస్తాం. కానీ అమెరికా, యూరప్ దేశాల జోక్యంతోనే ఇక్కడ సంఘర్షణలు, యుద్ధాలు, ఆందోళనలు, శత్రుత్వాలు తలెత్తుతున్నాయి” అని ఆయన చెప్పారు. అయితే, మంగళవారం ఇజ్రాయెల్ పై మిసైల్ దాడుల గురించి మాత్రం ఖమేనీ ప్రస్తావించలేదు.

దక్షిణ గాజాపై ఇజ్రాయెల్​ దాడి 51 మంది మృతి
మృతుల్లో మహిళలు, చిన్నారులు

 డెయిర్​ ఆల్​బలా: పాలస్తీనాపై ఇజ్రాయెల్​విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో బుధవారం గ్రౌండ్​ ఆపరేషన్​ప్రారంభించింది. ఈ దాడిలో 51 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. ఇందులో ఏడుగురు మహిళలు, 12 మంది చిన్నారులు ఉన్నట్టు పాలస్తీనా మెడికల్ అధికారులు వెల్లడించారు. 82 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. కాగా, ఖాన్ యూనిస్​ నగరానికి సమీపాన  3 చోట్లనుంచి ఇజ్రాయెల్​ సైన్యం వైమానిక దాడికి పాల్పడిందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. బాంబు మోతలతో ఆ ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోయాయని తెలిపారు.  ఇంకా చాలామంది శిథిలాల కిందే ఉన్నారని చెప్పారు.  అయితే, ఈ దాడిపై ఇజ్రాయెల్​ సైన్యం మాత్రం ఇంతవరకూ స్పందించలేదు.