
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ దేశ ఫుట్‌బాల్ హబ్‌గా మారనుంది. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ( ఫిఫా) ఆధ్వర్యంలో నడిచే టాలెంట్ డెవలప్‌మెంట్ స్కీమ్ (టీడీఎస్) అకాడమీ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. యువ క్రీడాకారుల ప్రతిభను మెరుగు పరిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఫిఫా ఇలాంటి రెసిడెన్షియల్ అకాడమీలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా లోకల్ టాలెంట్‌ను గుర్తించి వారికి అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ అందించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశాలను కల్పిస్తుంది.
ఇండియాలో ఇప్పటికే భువనేశ్వర్‌లో ఈ అకాడమీ నడుస్తోంది. ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో మరో అకాడమీ ఏర్పాటు చేయాలని ఫిఫా, ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిఫా టీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గెడ్ రోడీ, ఏఐఎఫ్‌ఎఫ్ సెక్రటరీ అనిల్ కుమార్.. శాట్జ్ వీసీ, ఎండీ సోని బాలాదేవి, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ (టీఎఫ్ఏ) సెక్రటరీ జీపీ పాల్గుణతో కలిసి బుధవారం గచ్చిబౌలి స్టేడియాన్ని పరిశీలించారు. అకాడమీ ఏర్పాటు, దాని కార్యకలాపాలకు అనుకూలతలను అంచనా వేసిన ఈ బృందం అనంతరం రాష్ట్ర క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో సమావేశమైంది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఫిఫా నిబంధనలను ఆమోదిస్తున్నట్టు తెలపడంతో గచ్చిబౌలి స్టేడియంలో ఫిఫా టీడీఎస్ అకాడమీకి మార్గం సుగమం అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మూడు నెలల్లోనే అకాడమీ కార్యకలాపాలు మొదలవుతాయని టీఎఫ్ఏ సెక్రటరీ పాల్గుణ తెలిపారు. భువనేశ్వర్ అకాడమీలో అండర్–13 బాయ్స్‌కు శిక్షణ ఇస్తుండగా.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అకాడమీలో 30 మంది చొప్పున అబ్బాయిలతో పాటు అమ్మాయిలను ఎంపిక చేసి ట్రెయినింగ్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.