నాలుగు యాక్సిడెంట్లు.. 15 మంది మృతి

  • గచ్చిబౌలిలో డ్రంకన్ డ్రైవ్ తో ముగ్గురు
  • కామారెడ్డిలో ఓవర్ స్పీడ్ తో 9 మంది  
  • హనుమకొండలో క్వారీలో టిప్పర్ బోల్తా పడి ముగ్గురు

గచ్చిబౌలి/కామారెడ్డి/ పిట్లం, వెలుగు: రాష్ట్రంలో శుక్రవారం అర్ధరాత్రి, శనివారం నాలుగు యాక్సిడెంట్లు జరిగాయి. 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. గచ్చిబౌలిలో తాగి కారు నడిపి చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు రెండు ముక్కలైంది. కామారెడ్డిలో ఆగి ఉన్న లారీని క్వాలీస్ ఢీకొట్టడంతో.. హైదరాబాద్ కు చెందిన రెండు కుటుంబాల్లోని ఏడుగురు మరణించారు. మరో ఐదుగురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు చనిపోయారు. హనుమకొండ జిల్లాలో క్వారీలో టిప్పర్ బోల్తా పడి, డ్రైవర్ సహా ముగ్గురు దుర్మరణం చెందారు.

చెట్టును ఢీకొట్టి.. కారు రెండు ముక్కలు

 హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాగి కారు నడపడంతో ముగ్గురు మృతి చెందారు. ఏపీలోని మచిలీపట్నానికి చెందిన సాయి సిద్ధూ (24) జూనియర్ ఆర్టిస్టు. సీరియల్స్, షార్ట్ ఫిల్మ్ లలో యాక్ట్ చేస్తుంటాడు. ఇతను గచ్చిబౌలి జేవీ కాలనీలో ఉంటున్నాడు. సిద్ధూకు విజయవాడ గునదలకు చెందిన షేక్​అబ్దుల్ రహీం (24) ఫ్రెండ్. షూటింగ్స్ ద్వారా సిద్ధూకు బెంగళూర్ గంగాధరాపురానికి చెందిన జూనియర్ ఆర్టిస్టు ఎన్.మానస (22) పరిచయమైంది. మానసకు ఇన్ స్టాగ్రామ్ ద్వారా మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం బాదెపల్లికి చెందిన ఎం.మానస (19) పరిచయమైంది. వీరిద్దరూ కలిసి షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేశారు. ఇలా వీళ్లు నలుగురూ ఫ్రెండ్స్ అయ్యారు.

సిద్ధూ ఫ్లాట్ లో పార్టీ..

శనివారం లింగంపల్లిలో షార్ట్​ ఫిల్మ్ ​షూటింగ్ ఉండడంతో, శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని సిద్ధూ ఫ్లాట్​కు ఇద్దరు మానసలు వెళ్లారు. రహీంను కూడా ఫ్లాట్​కు రమ్మని సిద్ధూ పిలిచాడు. అతని కోసం జూమ్ కారు బుక్ చేశాడు. సిద్ధూ బుక్ చేసిన వెర్నా (టీఎస్​07యూహెచ్​1349) కారులో ఫ్లాట్​కు మాదాపూర్ నుంచి రహీం వచ్చాడు. రాత్రి అందరూ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. 

చాయ్ తాగేందుకు బయటకు వెళ్లి..

అర్ధరాత్రి ఒంటి గంట దాటినంక చాయ్ తాగేందుకని కారులో నలుగురూ బయటకు వెళ్లారు. రహీం డ్రైవింగ్ చేయగా, సిద్ధూ అతని పక్కన కూర్చుకున్నాడు. వెనకాల అమ్మాయిలు కూర్చున్నారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్తుండగా హెచ్ సీయూ దగ్గర్లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద.. తెల్లవారుజామున 2:20కి రహీం ఓవర్ స్పీడ్ తో వెళ్లి చెట్టును ఢీకొట్టాడు. స్పాట్ లోనే రహీం, ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు. సిద్ధూకు గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి కారు రెండు ముక్కలైంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా రహీం చనిపోయాడు. కారు 200 కిలోమీటర్ల స్పీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  

అప్పుడు భార్య.. ఇప్పుడు బిడ్డ 

బాదెపల్లికి చెందిన మాడమోని రవీందర్​కు ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ వైష్ణవికి పెండ్లి అయింది. చిన్న బిడ్డ మానస ఇంటర్ వరకు చదువుకుంది. షార్ట్ ఫిల్మ్ లలో యాక్ట్ చేస్తోంది. 2016లో జడ్చర్ల హైవేపై జరిగిన ప్రమాదంలో రవీందర్ భార్య బాలమణి చనిపోగా, ఇప్పుడు బిడ్డ చనిపోయింది. 

ఓవర్ స్పీడ్​కు 9 మంది బలి

ఓవర్ స్పీడ్ 9 మంది ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు యాక్సిడెంట్లతో నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్​లోని చాదర్​ఘాట్,  ఫలక్ నుమా ప్రాంతాలకు చెందిన మహ్మద్​హుస్సేన్, అమీర్​తాజ్​ఫ్యామిలీలు రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర నాందేడ్ సమీపంలోని దర్గాకు వెళ్లాయి. పెద్దలు, పిల్లలు కలిసి మొత్తం 12 మంది క్వాలీస్ లో అక్కడికి వెళ్లగా, తిరిగి శనివారం హైదరాబాద్ కు బయలుదేరారు. వీరి వెహికల్ మధ్యాహ్నం 2 గంటల టైమ్ లో కామారెడ్డి జిల్లా పెద్దకొడప్​గల్​మండలం జగన్నాథ్​పల్లి వద్దకు రాగానే యాక్సిడెంట్ అయింది. హర్యానాకు చెందిన లారీ నాందేడ్ నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా, ఆ డ్రైవర్ జగన్నాథ్​పల్లిలో దాబా వద్ద రోడ్డు పక్కన ఆపాడు. ఆ టైమ్ లో ఓవర్ స్పీడ్ తో వచ్చిన క్వాలీస్.. లారీని ఢీకొట్టి, దాని కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, ఐదుగురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. అమీర్​తాజ్(31), అతని భార్య షనాబేగం (28), పిల్లలు హసన్​(2), హనియా (6 నెలలు)... మరో కుటుంబంలో మహ్మద్​ హుస్సేన్(35), అతని భార్య తస్లీం బేగం(30) స్పాట్ లోనే చనిపోయారు. హుస్సేన్ కూతురు నూరా (9)  నిజామాబాద్ ఆస్పత్రిలో చనిపోయింది. 

వెహికల్​లో ఇరుక్కుపోయిన డెడ్ బాడీలు.. 

బాన్స్​వాడ డీఎస్పీ జైపాల్​రెడ్డి,  బిచ్కుంద సీఐ శోభన్​, ఎస్సై విజయ్​స్పాట్ కు వచ్చి పరిశీలించారు. వెహికల్​లో ఇరుక్కుపోయిన డెడ్ బాడీలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. గాయాలైన ఐదుగురు చిన్నారులను మొదట బాన్స్ వాడ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. పిల్లల వయసు 2 నుంచి 8 ఏండ్ల లోపు ఉంటుంది. వీళ్లలో హుస్సేన్ పిల్లలు నలుగురు, ఒకరు అతని బంధువుల పాప ఉంది. ఓవర్ స్పీడ్ తోనే ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు. కాగా, ప్రమాదంలోనే రెండు కుటుంబాల్లోని పెద్దలు చనిపోయారు. దీంతో నిజామాబాద్ లోని కొందరు ప్రతినిధులు ముందుకొచ్చి పిల్లలకు ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు. 

జుక్కల్​ మండలంలో ఇద్దరు..

జుక్కల్ మండలంలో జరిగిన మరో ఘటనలో ఓవర్ స్పీడ్ తో ఇద్దరు యువకులు చనిపోయారు. కల్లాలికి చెందిన శివగొండ( 35), సాయిలు (26)లు బైక్​పై జుక్కల్ నుంచి సొంతూరికి వెళ్తుండగా... ఖండేభల్లూర్​సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన కల్టివేటర్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వాళ్లను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీనివాస్ చెప్పారు.

క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి

క్వారీలో టిప్పర్ బోల్తా పడి డ్రైవర్ సహా ముగ్గురు చనిపోయారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లిలోని లక్ష్మీ గ్రానైట్ లో ఈ ప్రమాదం జరిగింది. మృతులను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చింతం చందు (20), గూడూరు మండలం బోడుగొండకు చెందిన తోకల మహేశ్ (23), బిహార్ కు చెందిన మహ్మద్ హకీం(22)గా గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి రాళ్లను టిప్పర్ లోకి కూలీలు నింపారు. వాటిని క్వారీ చివరి భాగంలో పడేసేందుకు ముగ్గురు వెళ్లారు. అయితే రివర్స్ తీస్తున్న క్రమంలో టిప్పర్ అదుపు తప్పి పైనుంచి కిందికి పడిపోయింది. టిప్పర్ లో ఇరుకున్న ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలోనే చందు, హకీం చనిపోగా, శనివారం ఉదయం మహేశ్ మరణించాడు. క్వారీలో పని చేస్తున్న చందు సోదరుడు హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.