యాదాద్రి జిల్లాకు ఆర్థిక సంఘం నిధులు

యాదాద్రి జిల్లాకు ఆర్థిక సంఘం నిధులు
  • 10 శాతం పరిపాలన ఖర్చులకు ఆమోదించిన ప్లానింగ్​ కమిటీ

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నుంచి 2025–-26 ఫైనాన్స్ ఇయర్​లో కేంద్ర ప్రభుత్వం రూ.2,16,91,520 కేటాయించింది. సబ్​కే యోజన.. -సబ్​కా వికాస్​లో భాగంగా 2011 జనాభా లెక్కల ప్రకారం జరిపిన ఈ కేటాయింపులను బుధవారం జిల్లా పరిషత్​లో సమావేశమై జిల్లా పంచాయతీ ప్లానింగ్ కమిటీ ఆమోదించింది. ఇందులో టైడ్ గ్రాంట్ కింద జనరల్ కోటాలో రూ.1,03,36,906 కేటాయింపులు జరపగా, అన్​-టైడ్ కింద జనరల్ కోటాలో రూ.68,91,270 కేటాయింపులు జరిపారు. ఎస్సీ కోటాలో టైడ్, అన్-టైడ్ కింద రూ.34,30,136 కేటాయించగా, ఎస్టీ కోటాలో టైడ్, అన్-టైడ్ గ్రాంట్ కింద రూ.10,33,208 కేటాయించారు. 

ఈ నిధుల్లో తాగునీరు, పారిశుధ్యానికి పెద్ద పీట వేశారు. మొత్తంగా కేటాయించిన ఫండ్స్​లో తాగునీరు, పారిశుధ్యానికి రూ.1,30,14,913 (60 శాతం) తాగునీరు, పారిశుధ్యం కోసం ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించారు. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రూ.26.78 లక్షలు (21 శాతం) ఖర్చు చేయాల్సి ఉంటుంది. అన్-టైడ్​ కింద కేటాయించిన రూ. 86,76,607లో 10 శాతం ఫండ్స్​ను పరిపాలన ఖర్చులకు వినియోగించాలని, మిగిలిన మొత్తం అత్యవసర పనుల కోసం ఖర్చు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. 

నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి.. 

ఎండాకాలంలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గంగాధర్‌‌‌‌‌‌‌‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పంచాయతీ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌కమిటీ సమావేశలో ఆయన మాట్లాడారు. నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ నీరు సరఫరా చేయాలని చెప్పారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలన్నారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మీటింగ్​లో జడ్పీ సీఈవో శోభారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.