
ముంబై: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్–18లో వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రైన్ రికెల్టన్ (32 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58), సూర్యకుమార్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలకు తోడు బుమ్రా (4/22), బౌల్ట్ (3/20), విల్ జాక్స్ (2/18) బౌలింగ్‌లో చెలరేగడంతో.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 54 రన్స్ తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై గెలిచింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 215/7 స్కోరు చేసింది. తర్వాత లక్నో 20 ఓవర్లలో 161 రన్స్‌కే ఆలౌటైంది. ఆయుష్ బదోనీ (35), మిచెల్ మార్ష్ (34) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. విల్ జాక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బ్యాటర్లు సమష్టిగా..
ముంబై ఇన్నింగ్స్‌కు రికెల్టన్ అదిరిపోయే ఆరంభాన్నిస్తే.. మధ్యలో సూర్య దుమ్మురేపాడు. చివర్లో నమన్ ధీర్ సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. స్టార్టింగ్‌లోనే రికెల్టన్ 4, 6, 4, 4తో టచ్‌లోకి రాగా, మూడో ఓవర్‌లో వరుస సిక్స్‌లు కొట్టిన రోహిత్ (12) ఐదో బాల్‌కు మయాంక్ (2/40)కు వికెట్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 33 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. విల్ జాక్స్ (29) నెమ్మదిగా ఆడినా రికెల్టన్ మాత్రం ఐదు, ఆరు ఓవర్లలో 6, 6, 4, 6 దంచడంతో పవర్‌ప్లేలో ముంబై 66/1 స్కోరు చేసింది. ఈ క్రమంలో రికెల్టన్ 25 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు.
ఫీల్డింగ్ పెరిగిన తర్వాత లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ (1/48) 9వ ఓవర్‌లో రికెల్టన్‌ను ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 55 రన్స్ జతయ్యాయి. 10వ ఓవర్‌లో సూర్య ఫోర్‌తో కుదురుకోగా, జాక్స్ 4, 6 కొట్టడంతో ఫస్ట్ టెన్‌లో ముంబై స్కోరు105/2కి చేరింది. 11వ ఓవర్‌లో సిక్స్‌తో సూర్య ప్రతాపం మరో మెట్టు ఎక్కింది. 12వ ఓవర్‌లో విల్ జాక్స్‌ను ప్రిన్స్ యాదవ్ (1/44) పెవిలియన్‌కు పంపాడు. తిలక్ వర్మ (6) ఫోర్‌తో ఖాతా తెరిచినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. 13వ ఓవర్‌లో సూర్య 6, 4, 4 బాదితే ఆఖరి బాల్‌కు తిలక్ వెనుదిరిగాడు.
తర్వాత సూర్య 4, 6 రాబట్టడంతో 15 ఓవర్లలో ముంబై 157/4 స్కోరు చేసింది. 16వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా (5) కూడా ఔట్ కావడంతో స్కోరు 157/5గా మారింది. నమన్ ధీర్ (25 నాటౌట్) స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సూర్యకు చాన్స్ ఇచ్చాడు. 17వ ఓవర్‌లో నమన్ రెండు ఫోర్లతో 12 రన్స్ రాబట్టాడు. అవేశ్ ఖాన్ (2/42) వేసిన 18వ ఓవర్‌లో సిక్స్‌తో 27 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన సూర్య మూడో బాల్‌కు ఔటయ్యాడు. 19వ ఓవర్‌లో కార్బిన్ బోస్ (20).. 4, 6, నమన్ 6తో 19 రన్స్ వచ్చాయి. చివరి ఓవర్‌లో ఫోర్ కొట్టి కార్బిన్ ఔటైనా, నమన్ సిక్స్‌తో ముంబై భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.
బౌలింగ్ అదుర్స్..
లక్ష్య ఛేదనలో లక్నోని ముంబై బౌలర్లు బుమ్రా, బౌల్ట్, విల్ జాక్స్ అద్భుతంగా కట్టడి చేశారు. కీలక టైమ్‌లో వికెట్లు తీసి రన్స్‌ను అడ్డుకున్నారు. ఓపెనింగ్‌లో మిచెల్ మార్ష్ నిలకడగా ఆడినా మార్‌క్రమ్ (9) ఫెయిలయ్యాడు. వన్‌డౌన్‌లో నికోలస్ పూరన్ (27) వేగంగా ఆడినా వికెట్ కాపాడుకోలేదు. పవర్‌ప్లేలో 60 రన్స్ చేసిన లక్నోను ఏడో ఓవర్‌లో విల్ జాక్స్ ఘోరంగా దెబ్బకొట్టాడు. మూడు బాల్స్ తేడాలో పూరన్, రిషబ్ పంత్ (4)ను ఔట్ చేసి షాకిచ్చాడు. మిడిలార్డర్‌లో బదోనీ మెరుగ్గా ఆడాడు.
మార్ష్‌తో నాలుగో వికెట్‌కు 46 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇంపాక్ట్‌గా వచ్చిన మిల్లర్ (24) కూడా బ్యాట్ ఝుళిపించడంతో రన్‌రేట్ పెరిగింది. అయితే 15వ ఓవర్‌లో బౌల్ట్.. బదోనీ ఔట్ చేస్తే, 16వ ఓవర్‌లో బుమ్రా ట్రిపుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఆరు బాల్స్ తేడాలో మిల్లర్, అబ్దుల్ సమద్ (2), అవేశ్ ఖాన్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 141/5గా ఉన్న స్కోరు 142/8గా మారింది. రవి బిష్ణోయ్ (14), ప్రిన్స్ యాదవ్ (4 నాటౌట్), దిగ్వేష్ రాఠీ (1) లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 215/7 (రికెల్టన్ 58, సూర్య 54, మయాంక్ యాదవ్ 2/40, అవేశ్ ఖాన్ 2/42). లక్నో: 20 ఓవర్లలో 161 ఆలౌట్ (ఆయుష్ బదోనీ 35, మార్ష్ 34, బుమ్రా 4/22, బౌల్ట్ 3/20).