ఐదో రోజు నిమజ్జనం నెక్లెస్​ రోడ్డు​లోనే..

ఐదో రోజు నిమజ్జనం నెక్లెస్​ రోడ్డు​లోనే..
  • ఎన్టీఆర్​ మార్గ్​లో క్రేన్లు ఏర్పాటు చేయని అధికారులు
  • అటువైపు వచ్చే విగ్రహాలన్నీ పీపుల్స్​ ప్లాజా వైపు మళ్లింపు..  
  • మహా నిమజ్జనం రోజు అనుమతి ఇచ్చే చాన్స్​ 
  • ట్యాంక్​బండ్​పై ఇదివరకే అనుమతి లేదన్న పోలీసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో ఐదో రోజు వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు హుస్సేన్​సాగర్​ వైపు తరలిరాగా పోలీసులు పీవీ మార్గ్(నెక్లెస్​రోడ్డు)​ వైపు మళ్లించి నిమజ్జనం చేయించారు. కొద్ది రోజుల కింద ట్యాంక్​బండ్​పై నిమజ్జనం ఉంటుందా లేదా అన్న అనుమానాలు కలగ్గా పోలీసులు బారికేడ్లు, బోర్డులు పెట్టి అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు. హైకోర్టు ఆర్డర్​తో కేవలం ఎన్టీఆర్ ​మార్గ్​, పీవీ మార్గ్​లోనే నిమజ్జనం ఉంటుందని తేల్చి చెప్పారు. ఐదో రోజైన బుధవారం పెద్దసంఖ్యలో గణేశుడి విగ్రహాలు హుస్సేన్​సాగర్​కు తరలి వచ్చాయి. ఆఫీసులు, అపార్ట్​మెంట్లు, స్కూళ్లలో పెట్టిన విగ్రహాలు నిమజ్జనానికి రాగా పోలీసులు పీవీ మార్గ్​ వైపు తరలించారు.  

పీవీ మార్గ్​లో 12 క్రేన్లు...

నిమజ్జనానికి సంబంధించి పీవీ మార్గ్​లోనే జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు చోట్ల బేబీ పాండ్స్ లో నాలుగు క్రేన్లను, హుస్సేన్​సాగర్ పక్కనే మరో రెండు క్రేన్లను పెట్టారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఆరు భారీ క్రేన్లు సిద్ధంగా ఉంచారు. ఎన్టీఆర్ మార్గ్ లో రెండురోజుల కిందటి వరకు క్రేన్లు కనిపించినా, మంగళవారం సాయంత్రం వాటిని తొలగించారు. కాకపోతే లైట్ల ఏర్పాటు, క్రేన్లకు నంబరింగ్​ లాంటి పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటువైపు వచ్చే విగ్రహాలను పీవీ మార్గ్ వైపు పంపిస్తున్నారు. 

ట్రాఫిక్ ​ఇబ్బందులు కలగొద్దంటూ..

ఎన్టీఆర్​ మార్గ్​లో నిమజ్జనం గురించి అడిగితే అధికారులు స్పష్టత ఇవ్వలేదు. బందోబస్తులో ఉన్న పోలీసులు మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకే పీవీమార్గ్ వైపు పంపిస్తున్నామంటున్నారు. మరోవైపు పీపుల్స్ ప్లాజాలోనే పోలీసులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీవీ మార్గ్​లోనే ఎక్కువగా విగ్రహాలను నిమజ్జనం చేయిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.   

15 లేదా 16వ తేదీ నుంచి...

గ్రేటర్​లో సుమారు లక్షన్నర వరకు విగ్రహాలు ఏర్పాటయ్యాయని భాగ్యనగర్​ ఉత్సవ సమితి ఇది వరకే ప్రకటించింది. ప్రతి ఏడాది ట్యాంక్​బండ్, ఎన్టీఆర్ ​మార్గ్​లో వేల విగ్రహాలను నిమజ్జనం చేసేవారు. దీని కోసం 30 నుంచి 40 క్రేన్లను వాడేవారు. 2021లో హైకోర్టు ట్యాంక్​బండ్​పై విగ్రహాల నిమజ్జనం చేయొద్దని, అది కూడా మట్టి విగ్రహాలనే వేయాలని ఆదేశాలిచ్చింది. గత ఏడాది వరకు ఈ ఆదేశాల అమలు అంతంత మాత్రంగానే జరిగింది. ఈసారి కొందరు మళ్లీ కోర్టు గడప తొక్కడంతో గత ఆదేశాలే అమలో ఉంటాయని స్పష్టం చేసింది. దీని గురించి మండపాల నిర్వాహకులకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో మూడో రోజు నుంచే విగ్రహాలతో ట్యాంక్​బండ్​వైపు రావడం స్టార్ట్​ చేశారు.

దీంతో పోలీసులు  అనుమతించకుండా  ఫ్లెక్సీలు, బారికేడ్లు పెట్టారు. విగ్రహాలను ఎన్టీఆర్ ​మార్గ్ ​వైపు తీసుకువెళ్లి నిమజ్జనం చేయాలని సూచించారు. మంగళవారం వరకూ అలాగే జరిగింది. ఐదో రోజు ఎన్టీఆర్ ​మార్గ్​లో  క్రేన్లు ఏర్పాటు చేయకపోవడంతో అక్కడ నిమజ్జనాలు జరగలేదు. అన్నింటినీ పీవీ మార్గ్​వైపు పంపించారు. ఈ నెల15 లేదా16న ఎన్టీఆర్ మార్గ్​లో క్రేన్లు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత నిమజ్జనం యథావిధిగా ఉంటుందని చెబుతున్నారు.