చెత్త తెచ్చిన గొడవ..ఎస్ఐ కాలర్ పట్టుకుని వీరంగం

  • దంపతులను అరెస్ట్ చేసిన  అల్వాల్ పోలీసులు

అల్వాల్, వెలుగు :  ఓ కేసులో స్టేషన్ కు వచ్చిన దంపతులు వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దీంతో నిందితులైన దంపతులను అరెస్ట్ చేశారు. అల్వాల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఓల్డ్ అల్వాల్ గణేశ్​ఎన్ క్లేవ్ లో ఉండే శిల్ప, వెంకటేశ్వరరావు దంపతుల ఇంటికి ఎదురుగా పవన్ కుటుంబం నివసిస్తుంది.  వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు తమ ఇంట్లోని చెత్తను పవన్ ఇంటిముందు తరచూ వేస్తుండగా కొంతకాలంగా గొడవలు అవుతుండగా.. భరించలేక ఇటీవల పవన్ అల్వాల్ పోలీసులకు కంప్లయిట్ చేశారు.

దీంతో నచ్చజెప్పేందుకు అల్వాల్ ఎస్ఐ సురేశ్​ ఇరు కుటుంబాలను స్టేషన్ కు పిలిచారు. గురువారం శిల్ప దంపతులు రాగా.. వారికి నచ్చజెప్పినా వినకుండా ఎస్ఐ సురేశ్ తో​వాదనకు దిగారు. దీంతో  కేసు పెట్టాల్సి వస్తుందని ఎస్ఐ చెప్పారు. ఒక్కసారిగా శిల్ప ఊగిపోతూ ఎస్ఐ కాలర్ పట్టుకుని ‘ నువ్వేంత నీ స్థాయి ఎంత అంటూ’ వీరంగం సృష్టించారు. స్టేషన్ లో కుర్చీలో  కూర్చొని కాలుపై కాలు వేసుకొని.. ఏం చేస్తారో చేసుకోండి.. అంటూ హల్ చల్ చేశారు. దీంతో దంపతులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ తెలిపారు.