మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో నేతల మధ్య ఐక్యత కనిపించడం లేదు. వచ్చే ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేయాలని హైకమాండ్ భావించినా.. ఫీల్ట్ లెవల్‌లో సీన్ రివర్స్ అవుతోంది. పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఈ మీటింగుల్లో బయటపడుతోంది. పలుచోట్ల అసంతృప్త లీడర్లు, వారి అనుచరులు, సర్పంచులు దూరంగా ఉంటున్నారు. వచ్చినా తమకు గుర్తింపు ఇవ్వడం లేదని ముఖ్య నేతలతో వాగ్వాదానికి దిగుతున్నారు. చేసేది లేక లోకల్ లీడర్లు ఎస్‌హెచ్‌జీ మహిళలు, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, ఉపాధి కూలీలను తీసుకొచ్చి సమ్మేళనాల్లో కూర్చోబెడుతున్నారు.
దూరంగా ఉన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వర్గం
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్‌లో నిర్వహించిన సమ్మేళనానికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వర్గం గైర్హాజరైంది. ఈ విషయమై అంతకు ముందే ప్రచారం జరగడంతో స్థానిక నేతలు సెల్ఫ్ హెల్ప్గ్రూప్మహిళలను మీటింగ్‌కు తీసుకొచ్చారు. నిజాంపేటలో జరిగిన సమ్మేళనానికి జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, పాపన్నపేట సమ్మేళనానికి ఎంపీపీ చందన, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి డుమ్మా కొట్టారు. సంగా రెడ్డి జిల్లా కంది, సదాశివపేట మండల కేంద్రాల్లో చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళనానికి అసమ్మతి నేతలు హాజరు కాలేదు. వీరి విషయాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అసంతృప్తుల కారణంగా పటాన్ చెరు, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సమ్మేళనాలు పూర్తిస్థాయిలో జరగలేదు.
సీఎంను కలిపించాలని కార్యకర్తల నిరసన
సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదని, కొందరు నేతల ఒంటెత్తు పోకడలతో తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
జగదేవ్ పూర్ నిర్వహించిన సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని, తమ సమస్యలను ఆయనకు చెప్పుకుంటామని కార్యకర్తలు పట్టుబట్టారు. అంతకుముందు లీడర్లు మాట్లాడుతుండగా తమకు అవకాశం ఇవ్వరా..? అని నిలదీయడంతో వాగ్వాదం జరిగింది. దీంతో కొందరికి అవకాశం ఇవ్వగా.. సీఎం కేసీఆర్‌ను కలిపించాలని కోరారు.
పలుచోట్ల నిరసనలు
నర్సాపూర్ నియోజకవర్గం చిలప్‌చెడ్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల మీటింగ్‌లో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు లేదని, పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని మండిపడ్డారు. స్థానిక సర్పంచులతో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఎమ్మెల్యేకు నిరసన తప్పలేదు. తాము అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని, ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని సర్పంచులు వాపోయారు.
తమ సమస్యలు పరిష్కరించాలని లేదంటే మీటింగ్‌కు రామని తేల్చిచెప్పారు. పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌లో నిర్వహించిన సమ్మేళనానికి వచ్చిన మహిళలు తమకు పింఛన్ కార్డులు ఇచ్చి ఆరునెలలైనా అకౌంట్లలో పైసలు పడడం లేదని నిరసన తెలిపారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శాంక్షన్ చేస్తలేరని, కల్యాణ లక్ష్మీ చెక్కులు రావడం లేదని నిలదీశారు.