- పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు
- బీజేపీతో జత కట్టేందుకు అసమ్మతి నేతల ప్రయత్నం
- రేపు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
యాదాద్రి, వెలుగు : భువనగిరి బల్దియా పాలిటిక్స్ రసవత్తంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు సొంత పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్యపై అవిశ్వాసం ప్రకటించడంతో వారు పదవులు కోల్పోయారు. కొత్త చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ఈనెల 28న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అసమ్మతి గ్రూపులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. రెండు శిబిరాలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఎలాగైనా బల్దియాపై పట్టు సాధించాలని ఆరాటపడుతన్నాయి.
కాంగ్రెస్‌లో పోటాపోటీ
భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 కౌన్సిలర్లకు గాను బీఆర్ఎస్కు 20 మంది బలం ఉండేది. కాంగ్రెస్‌కు 9 , బీజేపీకి 6గురు సభ్యులున్నారు. బీఆర్ఎస్కు చెందిన 16 మంది తిరుగుబాటు చేశారు. వీరికి 9 మంది కాంగ్రెస్, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో జనవరి 23న 31 ఓట్లతో అవిశ్వాసం నెగ్గింది. దీంతో కొత్త చైర్మన్ ఎన్నిక ఈ నెల 28న జరపాలని స్టేట్‌ఎలక్షన్ కమిషన్ప్రకటించింది.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పాలిటిక్స్వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ అసమ్మతి గ్రూపు నుంచి విడతల వారీగా 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్శిబిరంలో చేరిపోయారు. దీంతో.. ఎక్స్ అఫీషియో సభ్యుడు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ బలం 18కి చేరింది. అవసరమైతే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను కూడా ఇక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్‌గా చేర్చాలని భావిస్తోంది.
కాంగ్రెస్ ఇప్పటికే తమ కౌన్సిలర్లను గోవాలో ఏర్పాటు చేసిన క్యాంపునకు తరలించింది. మంగళవారం వారు హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చైర్మన్ పదవి కోసం పోటీ నెలకొంది. పోత్నక్ ప్రమోద్‌కుమార్, తంగెళ్లపల్లి శ్రీవాణి, పోతంశెట్టి వెంకటేశ్వర్లు బల్దియా పీఠం కోసం పట్టుబడుతున్నట్టు చెప్తున్నారు. ఏకాభిప్రాయం కోసం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురిలో ఒకరికి చైర్మన్, మరొకరికి వైస్ చైర్మన్ పదవి ఇచ్చి ఒప్పించాలని చూస్తున్నారు.
బీజేపీతో అసమ్మతి నేతల మంతనాలు
మున్సిపల్ చైర్మన్ పదవిమీద కన్నేసిన బీఆర్ఎస్ అసమ్మతి నేత అజీమ్కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వెంట 8 మంది కౌన్సిలర్లున్నారు. ప్రస్తుతం వారు కూడా క్యాంప్‌లో ఉన్నారు. బీజేపీ మద్దతుతో పదవి దక్కించుకోవాలని ఆయన ఆపార్టీ లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బల్దియా కాంగ్రెస్వశం కాకుండా కలిసిరావాలని ఆయన కోరుతున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే బీజేపీకే చైర్మన్ పదవి ఇస్తామని కూడా రాయబారం చేస్తున్నట్టు సమాచారం.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ లీడర్లు బీఆర్ఎస్ అసమ్మతి లీడర్ల ఆఫర్ కు సానుకూలంగా స్పందించడంలేదని అంటున్నారు. ఓటింగ్ కు దూరంగా ఉండాలా.. తామే పోటీ చేయాలా అన్న డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది, ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్ అసమ్మతి వర్గం కలిసినా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు సంఖ్యాబలం సరిపోదు. బీఆర్ఎస్తోనే ఉన్న నలుగురు కౌన్సిలర్లు కూడా మద్దతు ఇస్తేనే వారి బలం 18కి చేరుతుంది. అ లెక్కన అసమ్మతి నేతల ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయే చూడాలి.