దమ్మపేట, వెలుగు : ఫారెస్ట్ సిబ్బంది, గిరిజనుల మధ్య జరిగిన పోడు పోరు విషాదంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో పోడు భూముల్లోని చెట్లను నరుకుతుండగా ప్రమాదవశాత్తు ఓ చెట్టు మీద పడడంతో బొర్రా తిరుపతమ్మ (45) అనే మహిళ చనిపోయింది. గురువారం ఈ విషాద ఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని నాగుపల్లి ప్రాంతంలో వారం రోజులుగా అటవీ అధికారులు, గిరిజనుల మధ్య పోడు గొడవ సాగుతున్నది.
తమకు సంబంధించిన పోడు భూముల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలుసుకొని గిరిజనులు అక్కడికి వెళ్లారు. సర్వేను అడ్డుకొని జామాయిల్ చెట్లను నరికివేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ చెట్టు తిరుపతమ్మపై పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు తీసుకెళ్లారు. ఖమ్మంలో చికిత్స తీసుకుంటూ తిరుపతమ్మ చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.