- రాయిటర్స్/ ఇప్సోస్ తాజా సర్వేలో వెల్లడి
- కమలకు 44శాతం, ట్రంప్‌కు 43శాతం మంది మద్దతు
- సెప్టెంబర్ నుంచి క్రమంగా తగ్గుతున్న కమల ఆధిక్యం
- సపోర్టర్లతో ఓట్లు వేయించినోళ్లకే గెలుపు చాన్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు..రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య హోరాహోరీ పోరు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనుండగా..ఇద్దరు అభ్యర్థులూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. గత జులైలో ఎన్నికల బరిలోకి దిగినప్పటి నుంచీ దాదాపుగా అన్ని సర్వేల్లోనూ కమల ముందంజలో నిలుస్తూ వస్తున్నారు. కానీ గత నెల రోజులుగా ఆమెకు ఓటర్ల నుంచి మద్దతు క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ఎన్నికల సర్వేల్లో ట్రంప్ క్రమంగా పుంజుకుంటున్నారు. తాజాగా రాయిటర్స్/ఇప్సోస్ సంస్థలు గత శుక్ర, శని, ఆదివారాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను మంగళవారం ప్రకటించాయి. ఈ సర్వేలో ట్రంప్ కంటే కమలా హారిస్ కేవలం ఒక పాయింట్ ముందంజలో మాత్రమే ఉన్నారు.
దీంతో ఇద్దరి మధ్య పోరాటం ‘నువ్వా? నేనా?’ అన్నట్టుగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. స్వింగ్ స్టేట్స్‌గా పేరు పొందిన ఏడు రాష్ట్రాలే విజేత ఎవరన్నది తేల్చవచ్చని అంటున్నారు. ఇక్కడ తమ మద్దతుదారుల్లో ఎవరు.. ఎంత ఎక్కువ మందితో ఓట్లు వేయించగలిగితే అంత ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయంటున్నారు.
కమలకు 44%.. ట్రంప్ కు 43% ..
రాయిటర్స్/ఇప్సోస్ తాజా సర్వేలో కమలా హారిస్ 44% పాయింట్లతో ముందంజలో నిలిచారు. ట్రంప్ అంతకంటే ఒక పాయింట్ పర్సెంటేజ్ తక్కువగా 43% మంది మద్దతు పొందారు.
ఈ అంచనాలకు ఎన్నికల ఫలితాలు మూడు పర్సెంటేజ్ పాయింట్లు అటూఇటూగా ఉండొచ్చని ఆ సర్వే సంస్థలు ప్రకటించాయి. అయితే, అక్టోబర్ 16 నుంచి 21 మధ్య రాయిటర్స్/ఇప్సోస్ నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే కమల రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉండగా, తాజా సర్వేలో ఓ పాయింట్ కోల్పోయారు.
తాజా సర్వే కోసం దేశవ్యాప్తంగా 975 మంది రిజిస్టర్డ్ ఓటర్లు సహా 1,150 మందిని ప్రశ్నించారు. వివిధ అంశాల్లో ఓటర్ల మద్దతును విడివిడిగా చూస్తే మాత్రం.. ట్రంప్‌కు ఓటర్ల సపోర్ట్ పెరిగినట్టు వెల్లడైంది.
ఎకానమీ, జాబ్స్‌లో ట్రంపే బెటర్
అమెరికా ఎకానమీని కాపాడటం, నిరుద్యోగాన్ని తగ్గించడం, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో ఎవరికి మద్దతు ఇస్తారని సర్వేలో ఓటర్లను ప్రశ్నించగా.. 47% మంది ట్రంప్ వైపే మొగ్గు చూపారు. ఈ అంశాలను కమల బాగా హ్యాండిల్ చేయగలరని కేవలం 37% మందే చెప్పారు.
ఎకానమీ విషయంలో మొదటి నుంచీ ట్రంప్ తన విధానాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దేశంలో ఎకానమీ, ఉద్యోగాలే అతిపెద్ద సమస్య అని తాజా సర్వేలో 26% మంది అభిప్రాయపడ్డారు. అలాగే రాజకీయ అతివాదం అతిపెద్ద సమస్య అని 24% మంది, వలసలు అతిపెద్ద సమస్య అని 18% మంది చెప్పారు.
మిగ్రేషన్లోనూ ట్రంప్‌కే ఫేవర్
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని ట్రంప్ తరచూ ప్రకటిస్తున్నారు. దేశంలో అక్రమంగా ఉంటున్న ఇమిగ్రెంట్లను సామూహికంగా వాళ్ల దేశాలకు పంపేస్తానని స్పష్టం చేస్తున్నారు. దీంతో వలసల విషయంలో అమెరికన్ ఓటర్లు కూడా ఎక్కువగా ట్రంప్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఇమిగ్రేషన్ విధానంలో ట్రంప్ చాలా బెస్ట్ అని 48% మంది ఓటర్లు అభిప్రాయపడగా.. కమల బెటర్ అని 33% మంది పేర్కొన్నారు.