టీఆర్ఎస్​లో కందాల, తుమ్మల మధ్య ఫైటింగ్    

ఖమ్మం, వెలుగు: జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి ఎవరెవరు, ఏ పార్టీ తరపున బరిలో ఉంటారనే చర్చ మొదలైంది. అధికార టీఆర్ఎస్  తరపున ఎవరు పోటీలో ఉంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. గత ఎన్నికల్లో గెలిచిన వారు, ఓడిపోయిన వారు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉండడం, ఇద్దరు నేతలూ తాము తప్పక బరిలో ఉంటామని చెబుతుండడం విశేషం. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కుదిరిన టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పొత్తుల నేపథ్యంలో పాలేరు స్థానాన్ని లెఫ్ట్​ పార్టీలకు కేటాయించే అవకాశం  ఉంటుందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. 

బరిలో ఉండేదెవరో..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు బరిలో ఉంటానని ప్రకటించారు. ఇటీవల ఆయన ఆత్మీయ సమావేశాల పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారు. గత ఎన్నికల్లో తుమ్మలపై కాంగ్రెస్  తరపున పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరడం, మళ్లీ ఎన్నికల బరిలో ఉండేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో తుమ్మల పార్టీ మారతారని, బల ప్రదర్శనలు అందుకేనని చర్చ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ నుంచి తుమ్మలకు ఆహ్వానం ఉందని, ఇక ఆయన నిర్ణయం తీసుకోవడమే అన్న ప్రచారం జరిగింది. వాటన్నింటినీ బ్రేక్  చేస్తూ తాను కేసీఆర్ వెంటనే ఉంటానని తాజాగా తుమ్మల ప్రకటించారు. అభివృద్ధి చేసేందుకు మళ్లీ తనకు ఒక అవకాశమివ్వాలంటూ ఆయన కార్యకర్తలను కోరారు. దీంతో ఇన్ని రోజుల నుంచి ఉన్న ప్రచారానికి బ్రేక్ పడినట్టయింది. అయితే మళ్లీ పాలేరు టికెట్ కోసం తుమ్మల వర్సెస్  కందాల పోటీలో బీఫామ్ ఎవరు దక్కించుకుంటారనే అంశంపై చర్చ మొదలైంది. 

తమ్మినేని ఫోకస్..

సీపీఎం, సీపీఐలతో భవిష్యత్ లోనూ పొత్తులుంటాయని టీఆర్ఎస్  ప్రకటించిన నేపథ్యంలో ఇంకో ఇంట్రస్టింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు కోరే స్థానాలపై చర్చ జరుగుతోంది. పాలేరు, మధిర, భద్రాచలం స్థానాలను సీపీఎం, వైరా, కొత్తగూడెం సీట్లను సీపీఐ అడుగుతుందని ఆ పార్టీల ముఖ్య నేతలు చెబుతున్నారు. రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఉమ్మడి జిల్లాకు చెందిన వారే కాగా, కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు, పాలేరులో తమ్మినేని వీరభద్రం బరిలో ఉంటారని అంటున్నారు. పాలేరు టికెట్ కోసం తుమ్మల, కందాల మధ్య పోటీ నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా ఈ సీటును సీపీఎంకు కేటాయించే అవకాశం ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే తమ్మినేని వీరభద్రం కూడా పాలేరులో గ్రిప్​ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా సీపీఎం నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన లీడర్లను మళ్లీ రప్పించేందుకు ఫోన్​లో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. తన పోటీపై డైరెక్ట్ గా చెప్పకుండానే, గ్రౌండ్ వర్క్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇకపై రెగ్యులర్​గా నియోజకవర్గంలో పర్యటనలకు ఆయన ప్లాన్​ చేస్తున్నారు. సీపీఎంకు గతంలో కంచుకోటలుగా ఉన్న మద్దులపల్లి, పొన్నెకల్లు, గుర్రాలపాడు, ముత్తగూడెం, తల్లంపాడు, నేలపట్ల, మూటాపురం, జక్కేపల్లి, సుర్దేపల్లి, జుజ్జులరావుపేట, పెరికసింగారంతో పాటు మరికొన్ని ఊర్లకు ముందుగా వెళ్లాలని భావిస్తున్నారు. 

మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏంటీ.?

ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో ఎర్రజెండా ఎగరడం ఖాయమని అన్నారు. దీంతో పాలేరులో తాను పోటీలో ఉంటానని ప్రకటించినట్లైంది. ఇప్పటికే టీఆర్ఎస్​లో ఉన్న ఇద్దరు ముఖ్య నేతలు సీటు మాదంటే మాదంటూ ప్రకటిస్తుండగా, ఇప్పుడు తమ్మినేని కూడా పాలేరుపై కర్చిఫ్ వేయడంతో ఎవరికి పోటీ చేసే అవకాశం దక్కినా, మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తోంది.