డైరెక్ట్ రిక్రూటీలకే సీనియర్ అసిస్టెంట్ పేస్కేల్ ఇవ్వాలంటూ సీఎస్ కు పల్లా రాజేశ్వర్ రెడ్డి లెటర్
తమ పరిస్థితి ఏందంటున్న మిగతా వీఆర్వోలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎస్ కు రాసిన లెటర్ వీఆర్వోల మధ్య చిచ్చురేపింది. ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత.. వారు మూడు నెలలుగా ఎలాంటి పోస్టింగ్ లు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని, ప్రమోషన్లు ఇవ్వాలని ఇప్పటికే పలువురు మంత్రులు, అధికారులను కలిసి వీఆర్వో సంఘాల నేతలు వినతిపత్రాలు సమర్పించారు. అయితే.. 2012, 2014, 2019లో నిర్వహించిన గ్రూప్ 4 ఎగ్జామ్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్ అయిన వీఆర్వోలకు మాత్రమే సీనియర్ అసిస్టెంట్ పేస్కేల్ వర్తింపజేయాలంటూ చీఫ్ సెక్రటరీకి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లెటర్ రాశారు. రాష్ట్రంలో మొత్తం 5,485 మంది వీఆర్వోలు ఉన్నారు. వీరిలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వీఆర్వోలు సమారు 1,500 మంది ఉండగా.. ప్రమోషన్ ద్వారా వీఆర్వోలుగా వచ్చినవాళ్లు సుమారు 4 వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. సీఎస్‌కు ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి లెటర్ రాయడంపై మిగతా వీఆర్వోలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగ భద్రత, ప్రమోషన్ల విషయంలో ఆందోళన చెందుతుంటే ఇలాంటి లెటర్లు రాయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తమను ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేసిందని, విభజించి పాలించే విధానంతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం ప్రతినిధి ఉపేందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వీఆర్వోలందరికీ సీనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
For More News..