జీహెచ్ఎంసీలో టికెట్ల లొల్లి షురూ

సిట్టింగ్​లకు గ్రూపుల గుబులు

పోటీకి  రెడీగా ఎమ్మెల్యేల అనుచరులు, ఫ్యామిలీ మెంబర్స్,​ సీనియర్​ నాయకులు

ఈసారి ఎన్నికల్లో సిట్టింగులకు టికెట్ కన్ఫర్మేషన్​ లేదు

డివిజన్ ​చేజారుతుందనే టెన్షన్​లో సిట్టింగ్ కార్పొరేటర్లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్​ రిలీజ్ కావడంతో అధికార పార్టీ సిట్టింగ్​ కార్పొరేటర్లకు గ్రూపుల గుబులు పట్టుకుంది. ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు, ఫ్యామిలీ మెంబర్స్, పార్టీ సీనియర్లు పోటీకి రెడీ అవుతున్నారు.  ఇదే ఇప్పుడు సిట్టింగులను కలవరపెడుతోంది. సిటీలో ప్రధాన డివిజన్లు మినహా 60 సిట్టింగ్ స్థానాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక విభేదాలున్న సిట్టింగ్ కార్పొరేటర్లకు చెక్ పెట్టే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. టికెట్ ఖరారుపై పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో సిట్టింగ్ కార్పొరేటర్లకు టెన్షన్ ​పట్టుకుంది.

అధిష్టానం వద్ద పక్కా సమాచారం

గత నాలుగేళ్లలో సిట్టింగ్ కార్పొరేటర్ల పనితీరు, అవినీతి వ్యవహారాలపై పక్కా సమాచారం అధిష్టానం వద్ద ఉంది.  డివిజన్ లో వారిపై ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని టికెట్ ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది. కొన్ని ఏరియాల్లోని పరిస్థితులను పరిశీలిస్తే..

సికింద్రాబాద్ సెగ్మెంట్​లోని బౌద్ధ నగర్, తార్నాక డివిజన్ కార్పొరేటర్లకు టికెట్ దక్కే చాన్స్ లేదనే ప్రచారం నడుస్తోంది. ఏదైనా ఒక స్థానం నుంచి డిప్యూటీ స్పీకర్ పద్మా రావు గౌడ్ కోడలిని బరిలోకి దించేందుకు  చూస్తున్నారు.

సనత్ నగర్ సెగ్మెంట్​లోని బేగంపేట్ సిట్టింగ్ కార్పొరేటర్ కాకుండా, మంత్రి  అనుచరుడికి  టికెట్​ఇప్పించే ప్రయత్నాలు స్పీడ్​గా సాగుతున్నాయి.

ముషీరాబాద్ సెగ్మెంట్​ పరిధిలో మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి.  భోలక్ పూర్ మినహా అన్ని టీఆర్ఎస్ స్థానాలే.  గాంధీనగర్, ముషీరాబాద్, అడిక్ మెట్, రాంనగర్ డివిజన్లలో తీవ్ర పోటీ ఉంది. ఓవైపు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, మరోవైపు మంత్రి తలసాని, మాజీ మంత్రి నాయిని వర్గీయులు ఆసక్తితో ఉన్నారు.  ఎమ్మెల్యే, కార్పొరేటర్  గ్రూపులు కట్టారు.  స్థానిక ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబరే గాంధీనగర్ డివిజన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన నాయిని వర్గీయులకు ప్రాధాన్యత లేకపోవడంతో ఈసారి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.  టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా, రాకుంటే ఇండిపెండెంట్​గానైనా బరిలో దిగే ప్లాన్​తో ఉన్నారు.

ఉప్పల్ ​సెగ్మెంట్​లో ఎమ్మెల్యే  బేతి సుభాష్ ​రెడ్డికి మెజార్టీ కార్పొరేటర్లతో సఖ్యతలేదు.ఈ సెగ్మెంట్​లోని చర్లపల్లి డివిజన్​నుంచి ప్రస్తుత మేయర్​ బొంతు రామ్మోహన్ ​భార్యను పోటీ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ స్థానిక, స్థానికేతర సమస్య వివాదంగా మారింది. మేయర్​ భార్యకు టికెట్​కేటాయిస్తే వ్యతిరేకంగా పని చేసేందుకు స్థానిక నాయకులు రెడీగా ఉన్నారు. అదే విధంగా ఏఎస్​రావు డివిజన్​లో సిట్టింగు కార్పొరేటర్​ పావనీ రెడ్డికి ఈసారి టికెట్​ కేటాయించరాదని, తమకు ఒక అవకాశమివ్వాలని పలువురు టీఆర్​ఎస్​ సీనియర్​ నాయకులు ప్రిపేర్ ​అవుతున్నారు.

మల్కాజిగిరి సెగ్మెంట్​లో  9 డివిజన్లు ఉండగా, అందులో ముగ్గురు నుంచి ఆరుగురు సిట్టింగులకు టికెట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యే హన్మంతరావు పలువురు కార్పొరేటర్లను మారుస్తూ కొత్తవారి పేర్లతో లిస్ట్​రెడీ చేస్తున్నట్లు తెలిసింది. ఈసారి తన కొడుకును ఈస్ట్​ఆనంద్​బాగ్​డివిజన్​నుంచి బరిలోకి దింపేందుకు కూడాఎమ్మెల్యే ఇంట్రస్ట్​ చూపుతున్నట్లు సమాచారం. గౌతమ్​నగర్​ డివిజన్​ నుంచి సిట్టింగు కార్పొరేటర్​ శిరీష జితేందర్​రెడ్డి ఈసారి పోటీ నుంచి స్వచ్ఛందగా తప్పుకుంటున్నట్లు  ఇప్పటికే ప్రకటించారు.

జూబ్లీహిల్స్​ఎమ్మెల్యే గోపీనాథ్ కు​ యూసుఫ్​గూడ, వెంగళరావునగర్​, రహమత్​నగర్ ​కార్పొరేటర్లతో విబేధాలు ఉన్నాయి. ఈసారి వారికి టికెట్లు కేటాయించేది లేదంటూ ఇటీవల జరిగిన ఓ మీటింగ్​లో ఎమ్మెల్యే  నేరుగానే చెప్పినట్లుగా సమాచారం.  తమకు టికెట్ ఎలా రాదో చూస్తామంటూ సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా సవాలు చేసినట్టు తెలిసింది.

ఎల్ బీ నగర్ ​సెగ్మెంట్​లో టీఆర్​ఎస్​లో రెండువర్గాలుగా చీలిపోగా వారి మధ్య తీవ్రవిభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే సుధీర్​రెడ్డితో పలువురు సిట్టింగు కార్పొరేటర్లకు మధ్య సఖ్యత లేదు. దీంతో బీఎన్​రెడ్డి నగర్​,చంపాపేట, నాగోల్ ​కార్పొరేటర్లను మార్చాలని ఎమ్మెల్యే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

ఖైరతాబాద్​ సెగ్మెంట్​లో సోమాజిగూడ కార్పొరేటర్​ విజయలక్ష్మి పోటీ చేయనని ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మూడు డివిజన్లలో అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నారు.

టికెట్ కోసం లొల్లి షురూ

అప్పుడే టీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి మొదలైంది. చాలా మంది ఆశావహులు ఈసారి టికెట్ మాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షణలు కూడా మొదలుపెట్టారు.  ఇప్పటికే పార్టీ క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి ఉంది. మొదటి నుంచి పార్టీకి సేవ చేసిన వారికి కాకుండా డబ్బులున్నోళ్లు, వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారని  పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. టికెట్ ఆశిస్తున్న వారు కూడా కార్యకర్తల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. సిట్టింగ్ లు మళ్లీ మాకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వాళ్లంతా  పైరవీలు షురూ చేశారు.  ఒక్కో డివిజన్ లో రెండు నుంచి ఐదు మంది వరకు టికెట్ ఆశిస్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

అసంతృప్తులపై బీజేపీ నజర్

టీఆర్ఎస్ అసంతృప్తులపై బీజేపీ నజర్ పెట్టిం ది. అధికార పార్టీకి దీటుగా ఉండే నేతలను పార్టీలో చేర్చుకొని బరిలో ఉంచేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ లో టికెట్ దక్కే అవకాశం లేని చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో మరింత మంది  టీఆర్ఎస్ నేతలు మా పార్టీలో చేరటం ఖాయమని బీజేపీ చెబుతోంది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే తమ్ముడు ప్రేమ్ దాస్ గౌడ్ గతంలో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయాడు.  ఆయనకు మళ్లీ టికెట్ దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అంబర్ పేట్   ఎమ్మెల్యే  వర్గీయులకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు జరుగుతుండ గా బాగ్ అంబర్ పేట్, అంబర్ పేట్ కార్పొరేటర్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

For More News..

డబుల్ బెడ్ రూంలు పంపిణీ చేయకముందే పాడువడ్తున్నయ్