చంద్రమండలంలో కేసు పెట్టినా వదలను

  • న్యాయం కోసం కొట్లాడుతానే ఉంటా 
  • రంగారెడ్డి కలెక్టరేట్​లో విచారణకు హాజరైన మంచు మనోజ్

ఇబ్రహీంపట్నం, వెలుగు: తనపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయం కోసం కొట్లాడుతూనే ఉంటానని సినీ నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ​కింద అతనిపై తన తండ్రి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో రంగారెడ్డి కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ ఎదుట శనివారం ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన అన్న కారణంగానే తగాదాలు జరుగుతున్నాయని, ఆస్తిపై కుటుంబంలోని అందరికీ హక్కు ఉంటుందన్నారు. సమస్యపై కూర్చుని మాట్లాడుకుందామని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ రావడం లేదన్నారు. 

జల్​పల్లిలో తన పాప ఇంట్లో ఉందని చెప్పినా తనను పంపకపోవడంతోనే ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. విద్యార్థుల సమస్యలపై మాట్లాడితే దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారన్నారు. తనపై తిరుపతిలో, పహాడీషరీఫ్​లో ఎన్ని కేసులు పెట్టినా న్యాయం కోసం కొట్లాడుతానని, ఆఖరికి చంద్రమండలంలో  కేసులు పెట్టినా కూర్చుని మాట్లాడేవరకు వదిలేదని స్పష్టం చేశారు.