విశ్లేషణ: ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలె

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు 15 శాతానికి తగ్గితే.. ప్రైవేట్ రంగ సంస్థలు 85 శాతానికి విస్తరించాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేనందువల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలు, వికలాంగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. దీంతో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు నిరుపయోగంగా మారుతున్నాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెరిగి దేశ ఐక్యతకు, అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. అందువల్ల ప్రభుత్వ రంగంలో అమలు చేస్తున్నట్టుగానే ప్రైవేట్ సెక్టార్​లో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలి. ఇందుకోసం పార్లమెంట్ లో చట్టం చేయాలి. అప్పుడే అన్ని వర్గాలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు కొంతైనా తగ్గుతాయి.

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఇటీవలి కాలంలో పోరాటాలు ఉధృతం అవుతున్నాయి. 1991 తర్వాత ప్రభుత్వరంగ సంస్థలను ఎక్కువగా ప్రైవేటుపరం చేయడం వల్ల పభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. దీని వల్ల రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చిన రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడంలేదు. ఈ పరిస్థితుల్లో దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. పేదలు మరింత పేదలుగా మారుతుంటే.. ధనవంతులు మాత్రం కోట్లకు కోట్లు సంపాదిస్తూ పడగలెత్తుతున్నారు.

స్వాతంత్ర్యానికి ముందు నుంచే రిజర్వేషన్లు
మనదేశాన్ని బ్రిటిష్ వారు పాలించిన కాలంలోనే కొన్ని సంస్థానాల్లో రిజర్వేషన్లను అమలు చేశారు. జ్యోతిబా పూలే 1882లోనే రిజర్వేషన్లు ఉండాలంటూ హంటర్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. 1902లో మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతాలలో సాహు మహారాజ్.. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో నిమ్నకులాల వారికి 50% రిజర్వేషన్లు కల్పించారు. మనదేశంలోని బీసీల స్థితిగతులపై 1921లో తొలిసారిగా మిల్లర్ కమిటీని వేశారు. దీని ప్రకారం మైసూర్ సంస్థానంలోనూ బీసీ జాబితాలోకి కొన్ని కులాలను చేర్చి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పాటించారు. 1935లో ట్రావెన్ కోర్ సంస్థానంలోనూ రిజర్వేషన్లు అమలు పరిచారు. వీటిని స్ఫూర్తిగా తీసుకొని చేసిన అనేక పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లను చేర్చి ఆర్టికల్ 15(1) ప్రకారం చట్టబద్ధత కల్పించారు. అయితే కుల ప్రతిపాదిత రిజర్వేషన్లు అమలు చేయకూడదని, ఆర్థిక అసమానత్వం ప్రాతిపదికనే రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు అగ్రవర్ణాల వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలో అందరికీ సమానహక్కులు, సౌకర్యాలు కల్పించాలనే స్ఫూర్తికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు దొరైరాజన్ కేసులో తీర్పునిచ్చింది. 

రాజ్యాంగానికి తొలి సవరణ చేసి..
దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు పాలక వర్గాలకు దూరమవుతాయనే ఉద్దేశంతో రాజ్యాంగానికి తొలి సవరణ చేశారు. 1951లో ఆర్టికల్ 16కు క్లాజ్ 4ను చేర్చి సామాజికంగా వెనుకబాటుకు గురైనవారికి ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్ల అమలు పదేండ్లకు మించి అవసరం లేదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం పేరుతో రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్స్ 38, 46ను చేర్చారు. ఆదేశిక సూత్రాల ఆధారంగానే దేశ పాలనను గావించాలని ఆర్టికల్ 37 చెపుతోంది. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ జాతీయంగా ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27% ఉన్నప్పటికీ, అనేక రాష్ట్రాల్లో భిన్నంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీలకు 6%, ఎస్సీలకు 15%, బీసీలకు 25%, ముస్లింల్లో వెనుకబడిన తరగతులకు 4% రిజర్వేషన్లు ఉన్నాయి.

తగ్గిపోతున్న ప్రభుత్వ ఉద్యోగాలు
1978లో జనతాపార్టీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీపీ మండల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్​ నివేదిక ఆధారంగా 1990లో కేంద్రం బీసీలకు 27% రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ అవకాశాల్లో కల్పించింది. కానీ బీసీ రిజర్వేషన్లు 2008 నుంచే ప్రారంభమయ్యాయి. కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఉద్యోగాల్లో బీసీల వాటా 4 శాతమే. ఎస్సీ, ఎస్టీల వాటా 5 శాతమే. దిగువ శ్రేణి ఉద్యోగాల్లోనూ వీరి వాటా 18.24% ఉంది. రక్షణ, మిలిటరీ, జ్యుడీషియల్ లాంటి చాలా వ్యవస్థల్లో అసలు రిజర్వేషన్లే లేవు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం వచ్చినా సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. 1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల కారణంగా 1957లో 85 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగం ఇప్పుడు 15 శాతానికి పడిపోయింది. అప్పట్లో 15 శాతమే ఉన్న ప్రైవేట్​ సెక్టార్​ 85 శాతానికి పెరిగింది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్​నర్​షిప్(పీపీపీ) విధానాన్ని ప్రవేశపెట్టి, ఉన్న 15% ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షల కోట్ల పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకుంది. వీటి వల్ల రిజర్వేషన్ల కింద రావాల్సిన 1.5 లక్షల ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.

ప్రతిభ ఆధారంగానే రిజర్వేషన్ల అమలు
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల వల్ల క్వాలిటీ తగ్గుతుందని వాదించేవారు కూడా ఉన్నారు. రైల్వేల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ అది ఇంకా పురోగతి సాధిస్తూనే ఉంది. ప్రతిభ ఆధారిత రిజర్వేషన్లనే ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీల్లో 90% పైగా మార్కులు సాధించిన వారే ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. ప్రతిభ గురించి మాట్లాడితే వ్యవసాయ రంగంలో ఎక్కువ నైపుణ్యం ఎస్సీ, ఎస్టీలకే ఉంటుంది. తయారీ రంగాలు, వృత్తి నైపుణ్యంలో ప్రతిభ బీసీలకే ఉంది. వ్యవసాయం, తయారీ, వృత్తి నైపుణ్యాల్లో అగ్రకులస్తులు వెనుకబడిన వర్గాలతో పోటీ పడలేరు. అరుణాచల్​ప్రదేశ్​లో 80% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడ 80% ప్రజలు గిరిజనులు కావడం వల్ల ప్రైవేటురంగం అభివృద్ధి చెందింది. ఆదివాసీ ప్రాంతాల్లోనే టూరిజం ఎక్కువగా అభివృద్ధి చెందుతోంది. పర్యాటక కేంద్రాల్లో 90% మంది ఆదివాసీలే ఉంటారు. ఇవన్నీ లాభాల్లోనే నడుస్తున్నాయి. 

ప్రైవేటు రంగానికి ప్రభుత్వ రాయితీలు
పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. ఎన్నో తరాలుగా శ్రమైక జీవులు శ్రమ దోపిడీకి గురవుతూ ఉత్పాదకతను పెంచుతున్నారు. వారికి ఆహారం కోసం మాత్రమే వేతనాన్ని ఇస్తున్న పెట్టుబడిదారులు వారి శ్రమను లాభాలుగా మార్చుకుంటున్నారు. దీంతో పెట్టుబడిదారుల దగ్గరే సంపద ఉండిపోతోంది. సమాజమంతటికీ చెందవలసిన వనరులను కొంతమంది కార్పొరేట్ శక్తులే దోచుకోవడం వల్ల మెజారిటీ ప్రజానీకం ఆర్థికంగా, సామాజికంగా అణచివేతకు గురవుతోంది. కార్పొరేటు శక్తులన్నీ ప్రభుత్వ బ్యాంకుల నుంచే లోన్లు తీసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు రంగ సంస్థలకు సబ్సిడీలు, పన్నుల మినహాయింపులు, భూమి, నీరు, విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, రవాణా సౌకర్యాలు, మార్కెట్, రక్షణ, ఇంకా అనేక రాయితీలు, సహకారాలు అందిస్తున్నాయి. అయితే అన్ని రాయితీలు పొందుతున్న ప్రైవేట్ రంగ సంస్థలు రిజర్వేషన్లను మాత్రం అమలు చేయడం లేదు.

ప్రత్యేక చట్టం కోసం పోరాడాలి
వివిధ పార్టీలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా.. ఆ తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదు. యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రైవేట్​ రంగంలో రిజర్వేషన్లకు సంబంధించిన చట్టం 
చేయకుండానే వెనక్కి తగ్గింది. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం దీని ఊసెత్తడం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్టీలు, మైనార్టీల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందేందుకు, ఆర్థిక సమానత్వం సాధించేందుకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు అత్యవసరం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్​లో చట్టం చేసేంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారికి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.

నష్టపోతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
మన పాలకులు మొదటి నుంచి రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలు చేయలేదు. జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు కావడం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఎస్సీలు 17%, ఎస్టీలు 9% ఉన్నారు. కానీ 1981 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7% రిజర్వేషన్లే అమలు పరుస్తున్నారు. అంటే రాజ్యాంగంలో గ్యారంటీ ఇచ్చిన చట్టాలకే దిక్కు లేకుండాపోయింది. భవిష్యత్తులో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం చట్టం చేసినా.. కార్పొరేట్ కంపెనీల ముందే ధర్నాలు చేసుకోండని చెప్పి చేతులు దులుపుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయక పోవడం వల్ల దళితులు 35% ఉద్యోగాలను కోల్పోయారు. బీసీలు, ఎస్టీలూ ఇలాగే నష్టపోయారు.

ఇప్పటికీ అగ్రకులాలదే ఆధిపత్యం
ఓబీసీల్లోని కొన్ని అగ్రకులాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల్లోనూ ధనికవర్గం ఉంది. వీరంతా రిజర్వేషన్ల ఫలితాలను ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అయినా 96% దళితులు ఇప్పటికీ ఆర్థికంగా వెనకబడేఉన్నారు. వీరంతా సామాజికంగా వివక్ష, దోపిడీకి, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారు. కులసంఘాలు అగ్రవర్ణ పార్టీలకు తొత్తులుగా మారాయి. అలాగే బీసీల్లోనూ మెజారిటీ కులాలు పేదరికంలోనే ఉన్నాయి. అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారు. అయితే అగ్రకులాల్లోని పేదలు ఆర్థికంగానే వెనకబడివుంటే, వెనకబడిన కులాల్లోని పేదలు కులవివక్షకు గురవుతూ సామాజికంగా, రాజకీయంగానూ వెనకబడిఉన్నారు. అందువల్ల రిజర్వేషన్లను ఇంకొంతకాలం అమలు చేయాల్సిన అవసరంఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు తగ్గిపోయినందువల్ల ప్రైవేటు రంగంలోనే ఇప్పుడు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అందువల్ల ప్రైవేట్​ సెక్టార్​లో కూడా రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావాలి. 

- మన్నారం నాగరాజు,  రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌స‌త్తా పార్టీ