కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలో శుక్రవారం మామ, అల్లుడి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ పెరిగి పెద్దదై మామ ప్రాణాలు తీసింది. కాగజ్ నగర్ రూరల్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లోడ్ పల్లి గ్రామానికి చెందిన పోతురాజుల భీమయ్య(52) పశువుల కాపరి. అతడి కూతురు సరితను అదే గ్రామానికి చెందిన సేగం తిరుపతితో నాలుగేండ్ల కింద పెండ్లి జరిపించాడు.
భీమయ్య ఇంటి దగ్గరలో మామ, అల్లుడి మధ్య రూ.3వేల విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ పెరిగి పెద్దదైంది. గొడవలోకి కన్నేపల్లి మండలం వీగాం గ్రామానికి చెందిన భీమయ్య మేనల్లుడు బుర్శ మల్లేశ్ కూడా వచ్చాడు. ఇద్దరు అల్లుళ్లు ఒక్కటై భీమయ్య మీద దాడి చేశారు . కోపంలో భీమయ్యను ఎత్తి రోడ్డు మీద పడేశారు. సిమెంట్ రోడ్ కావడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడి భార్య రాజక్క ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.